Site icon NTV Telugu

Mahanadu 2025: నేటి నుంచి టీడీపీ మహానాడు.. ఈరోజటి కార్యక్రమాలు ఇవే!

Tdp Mahanadu

Tdp Mahanadu

టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే ‘మహానాడు’ నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపు మయం అయింది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రానున్నారు. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్న నేపథ్యంలో మహానాడు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

మహానాడు నిర్వహణకు కడప శివారులోని చెర్లోపల్లిలో టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి రెండు రోజులూ ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక వాహనాల పార్కింగ్‌కు ఏకంగా 450 ఎకరాలు కేటాయించారు. టీడీపీ మూల సూత్రాలు, భవిష్యత్‌ లక్ష్యాలకు అనుగుణంగా ఆరు ప్రధాన అంశాల ప్రాతిపదికగా మహానాడులో చర్చించనున్నారు. కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగుజాతి-విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం-పేదల ప్రగతి, అన్నదాతకు అండ అనే అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉండనున్నాయి.

ఉదయం10:30కి మహానాడు ప్రారంభం అవుతుంది. మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, నాయకులు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. మంత్రి నారా లోకేష్‌ ప్రతిపాదించిన 6 అంశాలపై ప్రధాన ఫోకస్‌ ఉంటుంది. అనంతరం టీడీపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్‌ జరుగుతుంది. రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుంది.

Also Read: Coronavirus: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. వెయ్యి దాటిన పాజిటివ్‌ కేసుల సంఖ్య!

నేటి కార్యక్రమాలు ఇవే:
# ఉదయం 8.30 నుంచి10.00 గంటల వరకు ప్రతినిధుల నమోదు
# ఉదయం 10 నుంచి10.45 ఫొటో ప్రదర్శన, రక్తదాన శిబిరం ప్రారంభం
# ఉదయం 10.45 ప్రతినిధుల సభను పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన ఆరంభం
# ఉదయం 11.30 – 11.45 పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం
# 11.50 – 12.45 సీఎం చంద్రబాబు ప్రసంగం
# మధ్యాహ్నం 12.45 – 1.00 టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణపై చర్చ
# మధ్యాహ్నం 1 పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌
# మధ్యాహ్నం 2.00- 3.30 మధ్య కార్యకర్తే అధినేత అంశంపై చర్చ
# మధ్యాహ్నం 3.30 – 5.00 యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ప్రజాపాలనలో సాంకేతికత, వాట్సప్‌ గవర్నెన్స్‌పై చర్చ
# సాయంత్రం 5.00 – 6.00 రాష్ట్రంలో అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై చర్చ

Exit mobile version