ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారని, తప్పు చేసిన వారిని ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏపీలో నేరస్తులకు చోటు లేదని, ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తామన్నారు. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టం అని, తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేశాం అని.. అవినీతిపై పోరాటం చేస్తే ఇప్పుడు సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడు.. ఈరోజు ఉదయం కడప గడ్డపై ఆరంభమైంది. మహానాడులో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
‘ఈ రాష్ట్రాన్ని దశ దిశా మార్చే కార్యక్రమాలు చేపడతాం. తండ్రి ఆస్తిలో బాలికలకు హక్కు దగ్గర నుంచి డ్వాక్రా సంఘాల సాధికారత మహిళలకు పెద్ద పీఠం వేశాం. రాజకీయ పాఠశాలలో నేను కూడా నిత్య విద్యార్థినే. నేను ఒక సైనికుడిని, నిరంతరం పోరాటం చేస్తా. మీరు, నేను కలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేయగలుగుతాం. తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తుంది. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాటం చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీలో చూసినా టీడీపీ పార్టీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారు. కేంద్రంలో మన రాష్ట్ర పరపతి పెరిగింది. దేశంలోనే అన్ని పార్టీలు మనల్ని చూసి బీసీలను గుర్తించేలా వచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. కడపలో జరుగుతున్న ఈ మహానాడు ఒక చరిత్రను తిరగరాస్తుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
‘జల హారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం కోసమే నదులు అనుసంధానం చేపట్టాం. హైటెక్ సిటీతో హైదరాబాదులో ఆనాడు నేను ఐటీని ప్రారంభించాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. విజన్ ఆంధ్రతో 2047లో తీసుకొస్తాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీనే మన విధానం. 2047కు పేదరికం లేకుండా చేస్తాం. ఆర్థిక అసమానతలు తొలగించి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే నా ధ్యేయం. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తాం. టీడీపీ అవినీతిపై పోరాటం చేస్తే ఇప్పుడు సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చింది. ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై మనం చేసిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం. వైసీపీ ప్రభుత్వంలో స్కామ్ లెక్కలు లెక్క పెడుతున్నాం. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేదే లేదు. ఏపీలో నేరస్తులకు చోటు లేదు, ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తాం. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టం, తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైనా శిక్ష తప్పదు’ అని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
Also Read: CM Chandrababu: అందుకే కడప గడ్డపై ‘మహానాడు’ నిర్వహిస్తున్నాం!
‘కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం. ప్రజల్లో అలజడి పోయింది, అశాంతి పోయింది. కూటమి ప్రభుత్వంతో మనశ్శాంతి వచ్చింది. 64 లక్షల మందికి పెన్షన్లు పెంచాం. దీపం పథకంతో కోటి మందికి లబ్ధి చేకూర్చాం. అర్చకులు, ఇమాములు, మౌజన్‌లకు గౌరవ వేతనాలు పెంచాం. పారిశ్రామికవేత్తలు నమ్మకాన్ని పెంచి పెట్టుబడులు తెస్తున్నాం. 76 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. 10 లక్షల కోట్లు వారసత్వ అప్పు ఉంది. పాఠశాలలు ప్రారంభించే లోపు తల్లికి వందనం ఇస్తాం. రైతుకు న్యాయం చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.
