TDP Internal Rift in Polavaram: పోలవరం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. స్థానిక నాయకత్వం, వ్యవహారశైలిపై మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. తాను ఎనిమిది మండలాల్లో పర్యటించి.. ఏడు జడ్పీటీసీ, 28 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశానని లేఖలో శీతంశెట్టి పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నప్పటికీ.. స్థానికంగా కొందరు నాయకుల వ్యవహారశైలి కారణంగా పార్టీ క్యాడర్‌కు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రంపచోడవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తన కుమార్తెకు అవకాశం కల్పించినప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యే, ఆమె భర్త మాత్రం రెబల్ అభ్యర్థిని ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి ఆరోపించారు. పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా బరిలో నిలిచిన రెబల్ అభ్యర్థిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వం తీరుతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, క్యాడర్లో భయాందోళనలు నెలకొన్నాయని లేఖలో వివరించారు. పోలవరం జిల్లాలో టీడీపీ పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపించాలని, స్థానిక నాయకత్వం వ్యవహారశైలిపై నివేదిక తెప్పించుకొని బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ను శీతంశెట్టి కోరారు. ఈ ఫిర్యాదుపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

