TDP Candidates 1st List: మున్సిపల్‌ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు

Tdp 1st List

Tdp 1st List

TDP Candidates 1st List: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లో తొలి జాబితా విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ.. ఏడు కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్‌పర్సన్ స్థానాలకు మొత్తం 36 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సామాజిక సమీకరణాలతో పాటు మహిళలు, యువత, విద్యావంతులకు ప్రాధాన్యం కల్పించింది. ప్రకటించిన 36 మంది అభ్యర్థుల్లో 22 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు. అంటే మొత్తం జాబితాలో వీరి వాటా సుమారు 61 శాతంగా ఉంది.

బీసీలకు 44 శాతం కేటాయింపు
తొలి జాబితాలో బీసీలకు టీడీపీ గణనీయమైన ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 36 స్థానాల్లో 16 చోట్ల బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. దీంతో తొలి జాబితాలో బీసీల వాటా 44 శాతంగా నమోదైంది. ఏడు కార్పొరేషన్లలో ఐదు మేయర్ స్థానాలకు బీసీ, ఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో నలుగురు బీసీలు కాగా, ఒకరు ఎస్సీ వర్గానికి చెందినవారు. అలాగే ఆళ్లగడ్డ, రాయచోటిలో ఇద్దరు మైనారిటీ అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం జాబితాలో ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ అభ్యర్థికి చోటు కల్పించింది.

మహిళలకు అదనపు అవకాశాలు
మహిళా ప్రాతినిధ్యానికి కూడా టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 36 మంది అభ్యర్థుల్లో 19 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలు 17 కాగా, పార్టీ అంతకుమించి మరో రెండు స్థానాల్లో మహిళలకు అవకాశం కల్పించింది. మహిళలకు ప్రత్యేకంగా రిజర్వు కాని చిత్తూరు కార్పొరేషన్, బద్వేలు స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులను ఎంపిక చేసింది. దీంతో మహిళా రిజర్వేషన్ పరిధిని దాటి అదనంగా ఇద్దరికి అవకాశం దక్కింది.

యువతకు ప్రాధాన్యం.. 26 ఏళ్లకే అవకాశం
అభ్యర్థుల వయస్సు వివరాలను పరిశీలిస్తే యువతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 36 మంది అభ్యర్థుల సగటు వయస్సు 45.7 సంవత్సరాలు. వీరిలో 16 మంది 45 ఏళ్లలోపు ఉండగా, 10 మంది 40 ఏళ్లలోపు వారున్నారు. ఏడు మేయర్ అభ్యర్థుల సగటు వయస్సు 39 సంవత్సరాలుగా ఉంది. ఛైర్‌పర్సన్ అభ్యర్థుల సగటు వయస్సు 47.5 సంవత్సరాలు. ఈ జాబితాలో అత్యంత పిన్నవయస్కురాలిగా రాజంపేట అభ్యర్థి డాక్టర్ దొంతం గాయత్రి నిలిచారు. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. ఆ తర్వాత విజయనగరం అభ్యర్థి 31 ఏళ్ల వయస్సుతో ఉండగా, జీవీఎంసీ అభ్యర్థి వయస్సు 32 సంవత్సరాలుగా ఉంది.

విద్యావంతులకు చోటు
అభ్యర్థుల విద్యార్హతల విషయంలోనూ జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. విద్యార్హతల వివరాలు అందుబాటులో ఉన్న 33 మందిలో 25 మంది డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసించారు. వీరిలో ఏడుగురు పీజీ పట్టభద్రులు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులతో పాటు ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. మొత్తంగా టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో బీసీలకు 44 శాతం వాటా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 22 మంది అభ్యర్థులు, 19 మంది మహిళలు, యువతకు ప్రాధాన్యం, విద్యావంతులకు అవకాశం వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ ప్రకటించిన ఈ జాబితాలో సామాజిక ప్రాతినిధ్యం, మహిళా భాగస్వామ్యం, యువతకు అవకాశాలు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.