Site icon NTV Telugu

TDP: టీడీపీకి తలనొప్పి..!? ఉండిలో అసమ్మతి.. పాడేరు రెబల్స్ టెన్షన్.. మాడుగుల సీటుపై ఉత్కంఠ..!

Tdp

Tdp

TDP: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా.. ఇంకా కొన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు పోవడం లేదు.. సీట్ల సర్దుబాటులో అసమ్మతి, అసంతృప్తి వెళ్లగక్కుతున్న నేతలు.. కొన్ని చోట్ల పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీ గూటికి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని టీడీపీ అసమ్మతి క్రమంగా పెరుగుతూనే ఉంది.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. రామరాజు సీటు మారిస్తే సహించేది లేదంటూ తేగేసి చెబుతున్నారు కేడర్‌.. సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు, నాయకులు రాజీనామాలు చేస్తున్నారు.. ఈరోజు సాయంత్రం కార్యకర్తలతో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే రామరాజు.. సీటు రాకుంటే పార్టీ వీడే ఆలోచనలో రామరాజు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇక, విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్స్‌ టెన్షన్‌ పట్టుకుంది.. ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమవుతున్నారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. అయితే, టిక్కెట్ పోటీలో అనూహ్యంగా తెరపైకి వచ్చారు రమేష్ నాయుడు.. IVRS సర్వేలు పేరుతో రమేష్ నాయుడు అభ్యర్థిత్వం ఖరారు చేసింది అధిష్టానం.. కానీ, హైకమాండ్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తితో గిడ్డి వర్గం ఉంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో నలిగిపోతున్న పాడేరు టీడీపీకి ఈ పరిణామాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి.. ఇక, నిన్న తన వర్గంతో సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి.. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరతాను అంటున్నారు.. కాగా, 2014-19 మధ్య పాడేరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గిడ్డి ఈశ్వరి ప్రతినిథ్యం వహించిన విషయం విదితమే.

మరోవైపు విశాఖలోని మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది.. అభ్యర్థి మార్పు అనివార్యం అంటున్నాయి పార్టీ వర్గాలు.. మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచనలో పడిపోయింది.. మాడుగుల వెళ్లేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించడంలేదు బండారు.. పెందుర్తిలో అవమానించి.. మాడుగులలలో అవకాశంపై ఆసక్తి చూపడం లేదు మాజీ మంత్రి బండారు.. అయితే, తాను క్రియాశీల కార్యకర్తగా మాత్రమే మిగిలిపోతానని ఇప్పటికే బహిరంగ ప్రకటించారాయన.. ఇక, మాడుగుల సీటును NRI పైలా ప్రసాద్ కు కేటాయించింది టీడీపీ.. మరోవైపు హైకమాండ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు.. ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తుంది రామానాయుడు వర్గం.. ఇలా పలు నియోజకవర్గాల్లో సమస్యలు ఇంకా టీడీపీని వెంటాడుతూనే ఉన్నాయి.

Exit mobile version