NTV Telugu Site icon

AP Assembly: గ్రూప్ -1 పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ.. పరిశీలనకు మంత్రి పయ్యావుల హామీ

Ap Assembly

Ap Assembly

AP Assembly: గ్రూపు 1 పరీక్ష అక్రమాల పై గత ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తప్పు బట్టారు. గ్రూపు-1 పోస్టుల భర్తీ నియామక పరీక్షపై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. సభ్యుల సూచనల మేరకు సీబీఐ విచారణను పరిశీలిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని.. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఓ విద్యా సంస్థలో జరపాల్సిన మూల్యాంకనం.. హ్యాపీ రిసార్టులో జరిపారని ఆరోపణలు చేశారు. గ్రూపు 1 పోస్టుల భర్తీ విషయంలో రూ. 300 కోట్లు అవినీతి జరిగిందని.. ఏపీపీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు పలువురు వైసీపీ నేతలు ఏపీపీఎస్సీలో ఉండి అక్రమాలకు సహకరించారని ఆరోపించారు.

Read Also: Madanapalle Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై కొనసాగుతున్న విచారణ

ఈ విషయంపై అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ లో అక్రమాలు జరిగింది నిజమేనని.. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారని చెప్పారు. దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారన్నారు. గ్రూపు 1 అక్రమాల పై ప్రభుత్వం కూడా విచారణ కమిటి వేసిందన్నారు. ఆగస్ట్ 31 లోగా నివేదిక వస్తుందని.. నివేదిక వచ్చిన తర్వాత సభ్యుల కోరిన విధంగా సీబీఐ విచారణపై పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.