NTV Telugu Site icon

Chandrababu: కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్సులో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ అగ్ర నేతలు పురంధేశ్వరి, అరుణ్ సింగ్‌లు పాల్గొన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కాన్ఫరెన్సులో కూటమి అగ్ర నేతలు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు చంద్రబాబు సూచించారు. కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని.. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పని చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని ఆయన ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వైసీపీ కొర్రీలు వేయాలని చూసిందన్నారు. డిక్లరేషన్ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలన్నారు.

Read Also: Pawan Kalyan: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడిన పవన్ కల్యాణ్

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలు పెట్టిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారన్నారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలని చంద్రబాబు సూచించారు.

ప్రతి అభ్యర్థి లీగల్ టీంను అందుబాటులో ఉంచుకోవాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశ్యంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారన్నారు. ఏపీలో ఎన్డీయేకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలోనూ 53 శాతం ఓట్లతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. లెక్కింపులో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అడగాలని బీజేపీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వైసీపీ…కౌంటింగ్ సమయంలో కూడా ఘర్షణకు దిగే అవకాశం ఉందన్నారు.