Chandrababu: కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్సులో తిరుగుతున్నారన్నారు. తన తల్లీ – చెల్లీ వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధమని ఆయన పేర్కొన్నారు. ఏదో రకంగా ఇతరులపై బురద చల్లేసి బతకటమూ ఓ రాజకీయమా అంటూ ఎద్దేవా చేశారు. ఫించన్ల పెంపు అంటూ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి, రాజకీయ పార్టీలను విమర్శిస్తాడా అంటూ మండిపడ్డారు.
Read Also: Kesineni Nani: పార్టీలో కేశినేని చిన్ని ఎవరు?.. ఎంపీనా, ఎమ్మెల్యేనా ?
ఏప్రిల్ నాటికి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో పోతాడు, అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందన్నారు.అమరావతి రాజధానిపై విచారణను సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్‌కే వాయిదా వేసిందన్నారు. స్థానిక సుపరిపాలన – ఆత్మ గౌరవం -ఆత్మ విశ్వాసం డిక్లరేషన్‌ను తెలుగుదేశం ప్రకటిస్తోందన్నారు. ఈ డిక్లరేషన్‌ను తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. నిధులు, విధులకు సంబంధించి సర్పంచులకు సర్వాధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేసి తీరుతామన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు పంచాయితీలకు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Read Also: Nani vs Chinni: నాని వర్సెస్ చిన్ని.. తిరువూరులో అన్మదమ్ముల వర్గీయుల బాహాబాహీ
రానున్న 5 ఏళ్లలో ఈ నిధుల్ని 10శాతానికి పెంచుతామన్నారు. గ్రామంలో ఏ పని జరగాలన్నా సర్పంచ్, పంచాయతీ ఆధ్వర్యంలో జరిగేలా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. తమకు సేవ చేసేందుకు ప్రజలు సర్పంచులను ఎన్నుకుంటే, తన సేవ కోసం జగన్ వాలంటీర్లను నియమించాడని, వాలంటీర్లు కూడా సర్పంచుల ఆదేశాలతో ప్రజా సేవ చేయాలి కానీ జగన్ సేవ చేయకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో స్థానిక పాలన గౌరవాన్ని జగన్ తగ్గించేశాడని ఆయన మండిపడ్డారు. పంచాయతీల వ్యవస్థ ఎదుగుదలను జగన్ ఎక్కడికక్కడ నరికేశాడన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాన్ని రూ. 10వేలకు పెంచుతామన్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లకు రూ. 15వేలు, జెడ్పీ చైర్మన్, మేయర్ల గౌరవ వేతనాన్ని రూ. 50వేలకు పెంచుతామన్నారు.