Site icon NTV Telugu

TDP: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. జనసేన మద్దతు

Tdp Bandh

Tdp Bandh

TDP: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు తరలించడంపై రాష్ట్రంలో టీడీపీ భగ్గమంటోంది. చంద్రబాబు అరెస్ట్‌నకు నిరసన టీడీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారు జాము నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీడీపీ కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ బంద్‌ పిలుపుకు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ చేయనున్నట్లు తెలిపింది. టీడీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందంటూ పవన్‌ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ సహించదని బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని కోరారు.

Also Read: Chandrababu: రాజమండ్రి జైలుకు చంద్రబాబు.. ఖైదీ నంబర్‌ 7691

టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ కూడా సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. బంద్‌ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేశామని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అలాగే లోక్‌సత్తా పార్టీ, జై భీమ్ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నారంటూ బీజేపీ లెటర్‌ హెడ్‌తో ఒక నకిలీ లేఖ కలకలం సృష్టించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఓ ఫేక్ లెటర్‌ హెడ్‌ వాట్సాప్‌ గ్రూప్‌లలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు పురంధేశ్వరి వివరాలను వెల్లడించారు. అది నకిలీదని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో పాఠశాలలకు ఒక రోజు సెలవు ఇస్తున్నట్లు పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. పిల్లల భద్రత, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి. మరోవైపు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, సంబరాలు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఎస్పీలకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.

 

Exit mobile version