NTV Telugu Site icon

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ మౌనం.. టీడీపీ సంచలన వ్యాఖ్యలు..

Atchannaidu

Atchannaidu

Chandrababu Arrest: ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు అరెస్ట్‌ను సమర్థిస్తుంటే.. టీడీపీ సహా విపక్షాలు తప్పుబడుతున్నాయి.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా చాలా మందే స్పందించారు. అయితే, ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్‌పై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ స్పందించలేదు.. ‘దేవర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే స్పందించలేకపోయారని కొందరంటుంటే.. అసలు కనీసం ఒక్క ట్వీట్‌ అయినా.. సోషల్‌ మీడియాలో చిన్న మాటైనా చెప్పడానికి కూడా తీరిక లేకుండా ఉన్నారా? అని ప్రశ్నించేవారు లేకపోలేదు.. అయితే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై స్పందించారు.

మీడియా సమావేశంలో ఆయనకు ఎదురైన ప్రశ్నకు స్పందించిన అచ్చెన్నాయుడు.. అసలు జూనియర్ ఎన్టీఆర్‌ ఎందుకు స్పందించలేదో ఆయన్ని అడగాలని సమాధానం ఇచ్చారు.. ఎవరినీ స్పందించమని మేం అడగమని బదులిచ్చిన ఆయన.. సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారు. హైదరాబాద్, విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారు.. రాష్ట్ర విభజన సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారు తెలిపారు. కానీ, చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించాలని ఎవరనీ అడగబోమన్నారు అచ్చెన్నాయుడు.

మరోవైపు.. జనసేన పొత్తు.. ఉమ్మడి కమిటీల ఏర్పాటుపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జనసేనతో కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు. ఇప్పటికే టీడీపీ దీక్షా శిబిరాలకు జనసేన నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారన్న ఆయన.. పార్టీ నేతలతో చర్చించి సమన్వయ కమిటీ నియామకంపై నిర్ణయం తీసుకుంటాం అని వెల్లడించారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారు. స్కిల్ డెవలప్మెంటులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలనే ఉద్దేశ్యంతో వెబ్ సైట్ ఓపెన్ చేశామన్నారు. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్ సైటులో పొందుపరిచాం. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందని గుర్తుచేశారు. కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. 65 వేల మందికిపైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వాస్తవాలు తెలియజేయాలని వెబ్ సైట్ తీసుకొచ్చాం అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది నిరసనకు దిగుతున్నారు. రూ. 380 కోట్లు అవినీతి జరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచి వైసీపీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.