అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో దాదాపు విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని సమాచారం వినిపిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 230 మంది మృతుల్లో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా దేశస్థుడు ఉన్నారు. మృతుల్లో 217 మంది పెద్దవారు, 11 మంది పిల్లలు, ఇద్దరు పసివాళ్లు ఉన్నట్లు సమాచారం.
విమాన ప్రమాదంలో 169 మంది భారతీయులు మృతి చెందారని సమాచారం. కాగా ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి సహాయం అందించనున్నట్లు వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులను కంపెనీ పూర్తిగా భరిస్తుందని, వారికి అవసరమైన అన్ని సంరక్షణ దీర్ఘకాలిక మద్దతు లభిస్తుందని కూడా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
