Tanker crashes into Rolls Royce in Haryana: హర్యానాలోని నూహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, రోల్స్ రాయిస్ కారు ఢీకొన్న ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న ఇద్దరు మరణించగా.. లగ్జరీ కారులోని ప్రయాణికులు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో రోల్స్ రాయిస్ తుక్కు తుక్కైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ముంబయి-బరోడా ఎక్స్ ప్రెస్ హైవేపై హర్యానాలోని నూహ్‌లో లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌ను వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఉమ్రి గ్రామ సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా వెళ్తున్న రోల్స్ రాయిస్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది. ట్యాంకర్ బోల్తాపడగా లగ్జరీ కారుకు మంటలంటుకున్నాయి.
Read Also: Delhi Airport: రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్.. తప్పిన పెనుప్రమాదం
ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ రామ్‌ప్రీత్ , అతని హెల్పర్ కుల్దీప్ చనిపోయారు. ట్యాంకర్‌లో ఉన్న మరో వ్యక్తి గౌతమ్ గాయపడినట్లు తెలుస్తోంది. రోల్స్ రాయిస్‌లో ప్రయాణిస్తున్న చండీగఢ్ నివాసితులు దివ్య, తస్బీర్‌లుగా , మరొకరు ఢిల్లీ వాసి వికాస్‌గా గుర్తించారు. వీరు ముగ్గురు గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో రోల్స్ రాయిస్‌కి కొంచెం దూరంలో కారులో వస్తున్న వారి బంధువులు తక్షణం స్పందించి రక్షించినట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన ట్యాంకర్ డ్రైవర్ రామ్ ప్రీత్ , అతని హెల్పర్ కుల్దీప్‌లను ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుల నుంచి ప్రమాద వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఏఎస్‌ఐ తెలిపారు.