Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం

Cmvijay

Cmvijay

Tamil Nadu: కేంద్రంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది.. తమిళనాడులో హిందీ భాష, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం అనుసరిస్తున్న రెండు భాషల విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. నవోదయ పాఠశాలల కోసం భూమిని కేటాయించేందుకు కూడా రాష్ట్రం నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం-రాష్ట్రం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

సెప్టెంబర్ 17న నవోదయ పాఠశాలల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తింది. హిందీని పూర్తిగా రాష్ట్రం నుంచి మినహాయించలేమని పేర్కొన్న ధర్మాసనం.. హిందీ బోధనపై రాష్ట్రం పునరాలోచన చేయాలని సూచించింది. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలన్న గత ఆదేశాన్ని కూడా కోర్టు వెనక్కి తీసుకోలేదు. అయితే రాష్ట్రానికి మరో మూడు నెలల గడువు ఇచ్చింది. అయితే, ఈ వ్యాఖ్యలపై తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి, టీవీకే నేత రాజ్‌మోహన్ అరుముగం స్పందిస్తూ.. రాష్ట్రం రెండు భాషల విధానానికే కట్టుబడి ఉంటుందని తెలిపారు. హిందీతో పాటు ఏ భాషకు కూడా తమిళనాడు వ్యతిరేకం కాదని, అయితే తమిళ భాషకు రాష్ట్రంలో ప్రాధాన్యం ఉండాలని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు విచారణ సందర్భంగా చేసిన అభిప్రాయాలు మాత్రమేనని, తుది తీర్పుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు.

నవోదయ విద్యాలయాలు కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే కేంద్ర నిధులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు. ఈ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలవుతుండటంతో తమిళనాడు రెండు భాషల విధానానికి ఇది భిన్నంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రం మాత్రం దేశవ్యాప్తంగా విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే నవోదయ పాఠశాలల ఉద్దేశమని చెబుతోంది. ఈ వివాదంలో భాషా విధానంతో పాటు భూమి కేటాయింపు కూడా ప్రధాన అంశంగా మారింది. ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు తగిన భూమిని రాష్ట్రం గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాఠశాలల నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుందని, రాష్ట్రం భూమిని సమకూర్చాలని కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. కేంద్రం, రాష్ట్రం పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఇదిలా ఉండగా, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు. తమిళనాడుకు నవోదయ పాఠశాలలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నవోదయ పాఠశాలలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన సూచించారు. హిందీ విషయంలోనూ ఉదయనిధి స్టాలిన్ కీలక వివరణ ఇచ్చారు. తమిళనాడు హిందీకి లేదా ఇతర ఏ భాషకైనా వ్యతిరేకం కాదని, అయితే ఒక భాషను బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో సాధారణంగా రాజకీయంగా పరస్పరం విమర్శించుకునే అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే.. రెండు భాషల విధానం, నవోదయ పాఠశాలల అంశంలో ఒకే వైఖరిని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువులో తమిళనాడు ప్రభుత్వం తదుపరి ఏ చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారింది. మరోవైపు కేంద్రం, రాష్ట్రం మధ్య చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని కోర్టు సూచించిన నేపథ్యంలో ఈ వివాదం తదుపరి విచారణల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.