Site icon NTV Telugu

Tamilnadu: మహిళలకు తమిళనాడు సర్కారు గుడ్‌ న్యూస్‌

Tamilnadu

Tamilnadu

Tamilnadu: మహిళలకు తమిళనాడు సర్కారు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈరోజు మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార డీఎంకే ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని సర్కారు ఈ రోజుతో నెరవేర్చింది. ఈ పథకం రాష్ట్రంలోని దాదాపు 1 కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. డీఎంకె వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై జన్మదినమైన సెప్టెంబర్ 15 నుంచి అమలు చేయబడుతుంది. ఈ ఏడాది ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్లు కేటాయించింది.

ధర్మపురి జిల్లాలో ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ శిబిరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. మహిళల జీవితకాల నిస్వార్థ కృషికి ఇది గుర్తింపు అని, కోట్లాది మంది మహిళల జీవితాల్లో, కుటుంబాల్లో పునరుజ్జీవనం వస్తుందని, పేదరికం తగ్గిపోతుందని.. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. ఈ పథకం మహిళల కుటుంబ పెద్దలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళలను గుర్తించడానికి ప్రమాణాల జాబితాను ఇస్తుంది.

Also Read: Gyanvapi Survey: జ్ఞానవాపి సర్వే 2 రోజులు వద్దు.. పురావస్తు శాఖకు సుప్రీం ఆదేశం

ప్రభుత్వం మహిళా వీధి వ్యాపారులు, మత్స్యకారుల మహిళలు, నిర్మాణ పరిశ్రమలో ఉన్నవారు, ఒకటి కంటే ఎక్కువ గృహాలలో గృహ సహాయకులుగా పని చేసే కొద్దిపాటి ఆదాయాన్ని పొందుతున్న మహిళలను విస్తృతంగా లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏటా రూ.2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న కుటుంబాల్లోని మహిళలు, ఏటా 3,600 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించే వారు, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న వారిని మినహాయించింది. అంతేకాకుండా, 5 ఎకరాల కంటే తక్కువ చిత్తడి నేల లేదా 10 ఎకరాల పొడి భూమిని కలిగి ఉన్న కుటుంబాలు మాత్రమే పథకం నుంచి ప్రయోజనం పొందేందుకు అర్హులు.

ఈ పథకం మొదట నటుడు-రాజకీయవేత్త కమల్ హాసన్ ఆలోచన. 2021లో డీఎంకే తన మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముందు తన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆయన దీనిని ప్రకటించారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ అధికార పార్టీని విమర్శించాయి.

Exit mobile version