NTV Telugu Site icon

Telangana IT: తెలంగాణ ఐటీ పాలసీ భేష్.. అధ్యయనానికి వచ్చిన తమిళనాడు ఐటీ బృందం

Minister Ktr

Minister Ktr

Telangana IT: తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్) ఆధ్వర్యంలో ఒక బృందం రాష్ట్రానికి విచ్చేసింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు మంత్రి పీటీఆర్ బృందం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రగతిపైన, అందుకు దోహదం చేసిన అంశాలపైన అధ్యయనం చేసేందుకు తాము తెలంగాణలో పర్యటిస్తున్నామని మంత్రి పీటీఆర్ తెలిపారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటీ పాలసీ, ఐటీ అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తమిళనాడు మంత్రి బృందానికి కేటీఆర్ వివరాలు అందజేశారు.

Also Read: Kadiyam Srihari: మణిపూర్‌లో గొడవలకు కారణం బీజేపీ ప్రభుత్వమే..

తెలంగాణ ప్రభుత్వం ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను, అమలులోకి తీసుకువచ్చిన ఐటీ, ఐటీ అనుబంధ పాలసీలను కేటీఆర్ వివరించారు. ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణ, ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమ వంటి అంశాలను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇన్నోవేషన్ రంగానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని, అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తెలంగాణ ఐటీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమకు అనేక విధాలుగా మద్దతు అందించడం ద్వారా దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటితోపాటు ఐటీ అనుబంధ రంగాలకు ప్రత్యేకంగా ఒక పాలసీని తయారు చేసిన విధానం గురించి విస్తృతంగా వివరాలు అందించారు. తాము పాలసీలను రూపొందించే క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలతోపాటు పరిశ్రమలో ఉన్న భాగస్వాముల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకున్నామని, వారికి ఎలాంటి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందో తెలుసుకొని వాటన్నింటినీ తమ పాలసీల్లో పొందుపరిచామన్నారు. హైదరాబాద్ నగరం ఐటీ పరిశ్రమకు అత్యంత కీలకమన్న విషయాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టామని తెలిపారు.

Also Read: Pawan Kalyan: నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి.. రెడీ..

తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా పెట్టుబడులు తీసుకురావడాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా నిర్ధారించుకుని ఆ దిశగా కృషి చేశామన్నారు. పెట్టుబడులు వచ్చినప్పటిటీ తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలతోనూ స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకొని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందించామని కేటీఆర్ వెల్లడించారు. తెలిపారు. దీంతో అప్పటిదాకా హైదరాబాద్ నగరంలో పరిమిత కార్యకలాపాలు నిర్వహిస్తున్న, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, సర్వీస్ నౌ అనేక ఇతర దిగ్గజ కంపెనీలు ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తమ అతిపెద్ద లేదా రెండవ అతిపెద్ద కార్యాలయాలకు కేంద్రంగా మార్చుకున్న విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ పర్యటనకు సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌కు తమిళనాడు మంత్రి పీటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పాలసీలపైన మంత్రి పీటీఆర్ ప్రశంసలు కురిపించారు.