NTV Telugu Site icon

Fire Accident : చర్లపల్లి పారశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు

Fire

Fire

Fire Accident : హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫేస్-1 ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. కెమికల్ ఫ్యాక్టరీలో రసాయనాల వల్ల మంటలు మిన్నంటడంతో వాటి ప్రభావం చుట్టుపక్కల పరిశ్రమలకు విస్తరించింది.

సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీలో మొదలైన మంటలు సమీపంలోని ఇతర పరిశ్రమలకు వ్యాపించాయి. ముఖ్యంగా పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో పరిస్థితి మరింత విషమించింది. ప్రమాద స్థలం చుట్టూ దట్టమైన పొగలు అలముకున్నాయి. రసాయనాల వల్ల గాలిలో ప్రమాదకర వాయువులు విడుదల కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమల సమీపంలో నివసించే స్థానికులు ఈ మంటల వల్ల తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక వాహనాలు, నీటి ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. పరిశ్రమ చుట్టూ వాయువులు వ్యాపించడంతో మంటలను అదుపు చేయడంలో కాస్తంత కష్టాలు ఎదురవుతున్నాయి.

ఈ ఘటనపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందించి తక్షణమే పరిశీలనకు వచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన అగ్నిమాపక శాఖ, పరిశ్రమల యాజమాన్యాలు సమన్వయంతో పని చేసి మంటలను త్వరగా అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. పరిశ్రమల యాజమాన్యాలకు భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, తద్వారా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సర్వోదయ కెమికల్ పరిశ్రమలో మంటలు ఎలా చెలరేగాయి? ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కెమికల్ లీకేజీ, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, పరిశ్రమలో భద్రతా ప్రమాణాల లోపం వంటి కారణాలు ప్రమాదానికి దారి తీసి ఉంటాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పరిశీలన చేపట్టిన అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

ఈ ప్రమాదం అనంతరం పరిశ్రమల యాజమాన్యాలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారుల సూచనలు వచ్చాయి. రసాయన పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఆదునిక అగ్నిమాపక పరికరాలు, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, స్థానిక ప్రజలు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్లాలి అనే విషయాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసేందుకు కృషి కొనసాగిస్తున్నాయి. అయితే పరిశ్రమలో ఉన్న రసాయనాల ప్రేరేపణ వల్ల మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రజలు అగ్ని ప్రమాద ప్రాంతానికి దూరంగా ఉండాలని, గాలిలో ఉన్న రసాయనాల ప్రభావం తగ్గేంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 
Nara Lokesh: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసిన నారా లోకేష్