దొంగలు రకరకాలుగా ఉంటారు. మోటార్ సైకిళ్ళను ఎత్తుకెళ్ళేవారు కొందరయితే.. చైన్ స్నాచింగ్ లు చేసి మహిళల మెడలోని గొలుసులు కొట్టేసేవారు మరికొందరు. అయితే అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాడిపత్రి మునిసిపాలిటీ లో దొంగలు పడి సుమారు లక్షా 75 వేల రూపాయలు విలువైన మున్సిపల్ వాహనాల 12 టైర్లను దొంగలించారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. తాడిపత్రిలో మున్సిపల్ ఆఫీస్ గోడౌన్ లో ఉన్న 12 టైర్లు దొంగతనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాడిపత్రిలో మున్సిపాలిటీ వాహనాలకు టైర్లు కొనుగోలు చేసి కార్యాలయం కింద ఉన్న గోదాంలో నిల్వ ఉంచుతారు. వాహనాల టైర్లు పాడయినప్పుడు కొత్తవాటిని ఉపయోగిస్తారు. గత పది రోజుల క్రితం కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి సీసీ కెమెరాలు పక్కకు తిప్పి గోదాం తలుపులు తెరిచి సుమారు లక్ష 75 వేల రూపాయలు విలువచేసే 12 టైర్లను ఎత్తుకెళ్లారు. వాహనాల టైరు పాడయినప్పుడు కొత్త వాటిని తీసుకోవాలని గోదాం తెరిచినప్పుడు టైర్లు చోరీ అయిన సంగతి తెలుసుకున్న ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also:Digvijaya Singh: హిందువుల కంటే ముస్లిం ప్రజలనే హింసించింది.. అతిక్ గ్యాంగ్ పై దిగ్విజయ్ వ్యాఖ్య
తాడిపత్రి టౌన్ సిఐ ఆనంద రావు, ఎస్సై ధరణి బాబులు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకొని సీసీ పుటేజి పరిశీలించారు. సీసీ కెమెరాకి గుడ్డను కప్పి పక్కకు తిప్పి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. టైర్లు నిల్వ ఉన్న గోదాంలో రికార్డులను పరిశీలించారు. మున్సిపల్ వైస్ చైర్మన్లు అబ్దుల్ రహీం ,సరస్వతమ్మ ,టిడిపి కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కార్యాలయం గోదాములో ఉన్న టైర్లు దొంగతనానికి గురవుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని పలువురు ప్రశ్నించారు. దొంగతనం జరిగినట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ టైర్లు ఎత్తుకెళ్ళిన ఇంటి దొంగ ఎవరో త్వరలో తేలనుంది.
Read Also:KTR: హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. సిట్‌కో కార్యాలయం ప్రారంభంలో కేటీఆర్