NTV Telugu Site icon

T20 World Cup 2024: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు చావోరేవో! రికార్డ్స్ ఇవే

Indw Vs Pakw

Indw Vs Pakw

INDW vs PAKW T20 World Cup 2024 Playing 11: టీ20 ప్రపంచకప్‌ 2024లో తన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. నేడు కీలక పోరుకు సిద్దమైంది. లీగ్‌ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హర్మన్‌ప్రీత్‌ సేన తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు చావోరేవో. ఇకనుంచి ప్రతి మ్యాచూ కీలకం కాబట్టి పాకిస్థాన్‌పై నేడు గెలిచి తీరాల్సిందే. లేదంటే టోర్నీ ఆరంభ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడి మధ్య హర్మన్‌ప్రీత్‌ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో? చూడాలి.

బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు మంధాన, షెఫాలి దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే భారీ స్కోరు చేయడం కష్టమేమీ కాదు. జెమిమా, దీప్తి, రిచా చెలరేగితే ఇబ్బందులు ఉండవు. గత మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శన ఆశాజనకంగా లేదు. రేణుక సింగ్, ఆశ శోభన మాత్రమే పొదుపుగా బౌలింగ్‌ చేశారు. దీప్తి శర్మ తేలిపోయింది. అయితే ఫామ్‌లో ఉన్న పూజతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ ఒక్క ఓవరే బౌలింగ్‌ చేయించడం అందరిని ఆశ్చర్యం కలిగించింది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో జట్టులో మార్పులు ఉండకపోవచ్చు.

పాకిస్థాన్‌ జట్టుకు బౌలింగే బలం. స్పిన్‌లో నిదా దర్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, ట్యూబా హసన్, ఒమైమా సోహైల్‌ తిప్పేయగలరు. ముఖ్యంగా నిదా, సంధులు బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టగలరు. పేసర్ కమ్ కెప్టెన్‌ ఫాతిమా సనా మంచి ఫామ్‌లో ఉంది. ఫాతిమా, నిదా, ఒమైమా, నిదా బ్యాటింగ్‌లో పెద్ద బలం. ఓపెనర్లు ముబీనా అలీ, గుల్‌ ఫెరోజా దూకుడుగా ఆడతారు. కాబట్టి వీరిని భారత బౌలర్లు అడ్డుకుంటే విజయం సులువే.

Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణీ.. ఆస్ట్రేలియా మొదలుపెట్టింది!

రికార్డ్స్:
టీ20 మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్‌ జట్లు 15 సార్లు తలపడ్డాయి. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గగా.. పాక్‌ 3 గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లో ఇండో, పాక్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో నాలుగు భారత్‌ గెలిస్తే, పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది.

తుది జట్లు (అంచనా):
భారత్‌: స్మృతి, షెఫాలి, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), జెమీమా, రిచా, దీప్తి, శ్రేయాంక, పూజ, రేణుక, ఆశ, అరుంధతి.
పాకిస్థాన్‌: గుల్‌ ఫెరోజా, మునీబా, సిద్రా, నిదా, ఫాతిమా, ఒమైమా, ఆలియా, సాదియా, నష్రా, ట్యూబా, డయానా బేగ్‌.

Show comments