T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి ఆసన్నమైంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగియగా.. ఇక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొంటోంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌దే పైచేయి అనడంలో తప్పు లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్‌లపై గెలిచి కఠినమైన గ్రూప్-1 టాపర్‌గా ఆ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టగా.. కానీ పాక్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. సూపర్-12లో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన పాక్.. దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌పై ఓడిపోవడంతో అనూహ్యంగా సెమీస్‌కు చేరింది. అదృష్టం కలిసొచ్చిన పాకిస్తాన్ జట్టుతో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ నేడు జరిగే తొలి సెమీఫైనల్లో తలపడనుంది. ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ గెలుస్తుందా.. అదృష్టం కలిసొచ్చి సెమీస్ చేరిన పాక్ విజయం సాధిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.
ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఓడిపోలేదు. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్ పెద్ద మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ తడబాటు తెలియనిది కాదు. గత నాలుగు ప్రపంచకప్పుల్లోనూ సెమీఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఈ సారి ఎలాగైనా కప్పుకొట్టాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ జట్టు ఉంది. బలంగా లేని పాక్ బ్యాటింగ్ లైనప్‌ను త్వరగా దెబ్బతీయాలనే యోచనలో ఉంది కివీస్. ఈ సారి పాక్ విజయం అంత సులభం కాదేమో. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో పాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ విజయమే లక్ష్యంగా టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో బరిలోకి దిగుతోంది. పడుతూ లేస్తూ వచ్చిన బాబర్ ఆజమ్ బృందం ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సర్వశక్తులు ఒడ్డితేనే ముందడుగు వేస్తుంది. లేదంటే గత ఏడాది మాదిరిగానే ఈసారీ సెమీఫైనల్లో నిష్క్రమించాల్సి వస్తుంది. చివరిసారి 2009 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచిన పాక్ ఆ తర్వాత ఫైనల్ చేరలేకపోయింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇప్పటికీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్నాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. బ్యాటింగ్‌లో మూల స్తంభాలైన ఈ ఇద్దరి ఫామ్ పాక్‌కు ఆందోళన కలిగిస్తోంది.
Justice Chandrachud: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం
ఈ టీ20 ప్రపంచకప్ మొదటి నుంచి కూడా మంచి ఊపుమీదున్న న్యూజిలాండ్ నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తూ సెమీస్ చేరింది. ఒక్క ఇంగ్లండ్ మ్యాచ్‌లో మినహా ప్రతి మ్యాచ్‌లోనూ పెద్ద తేడాతోనే భారీ విజయాలను నమోదు చేసింది. ఆతిథ్య ఆసీస్‌నైతే 89 పరుగులతో ఓడించడం గమనార్హం. టాపార్డర్‌లో ఓపెనర్లు అలెన్, డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ సహా నాలుగో వరుసలో గ్లెన్ ఫిలిప్స్ రాణిస్తున్నారు. ముఖ్యంగా లంకతో జరిగిన పోరులో టాపార్డర్ మూకుమ్మడిగా విఫలమైనా… ఫిలిప్స్ ఒంటిచేతితో సెంచరీని బాది విజయాన్ని ఖాయం చేశాడు. బౌలింగ్‌లో బౌల్ట్, సౌతీ, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, సోధి ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ముచ్చెటమలు పట్టిస్తున్నారు. ఇంత పటిష్టంగా ఉన్న కివీస్ జట్టుపై పాక్ గెలవడం కష్టమేనని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
జట్లు (అంచనా)
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్‌ట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ ఖాన్, వసీమ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్.
