అమరావతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ సాధనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌కు నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు వాల్యూ ఎడిషన్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రూపొందించిన విజన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే ప్రాంతీయ అభివృద్ధితో పాటు రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా సులభంగా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సమాజంలో పేదలు మరియు ధనికుల మధ్య ఉన్న ఆర్థిక అంతరాలను తగ్గించడమే ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
స్థానికంగా అందుబాటులో ఉన్న వివిధ వనరులను సమర్థవంతంగా సమీకరించుకుంటూ, నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు వినూత్నంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రగతి పనుల కోసం ప్రతి నియోజకవర్గానికి రూ.1 కోటి చొప్పున కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సభలో బ్రహ్మాండమైన వ్యాపార సంస్థలు మరియు వ్యవస్థలను విజయవంతంగా నడిపిన అనుభవం ఉన్న నాయకులు ఉన్నారని, వారు తమ సొంత సంస్థలను ఏ విధంగా నడిపిస్తున్నారో అదే స్ఫూర్తితో నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. కేంద్ర మంత్రులుగా ఉన్న నాయకులు దేశవ్యాప్తంగా తమ శాఖలను పర్యవేక్షిస్తున్న అనుభవంతో తమ జిల్లాల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 28 కొత్త పాలసీలను తీసుకొచ్చిందని సీఎం పేర్కొన్నారు. చదువుకున్నవారు, విశ్రాంత ఉద్యోగులు అయిన ప్రజాప్రతినిధులు విజన్ డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా చదివి, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పురోగతి కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వందేళ్లలో జరిగే పనులను కేవలం పదేళ్లలోనే పూర్తిచేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని, అందుకే సాంకేతికతను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.

