సంక్షేమ శాఖలపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఓ క్యాలెండర్ రూపోందించాలని.. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. పార్వతిపురం మన్యం జిల్లాలో జరుగుతోన్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండని, హాస్టళ్లలో విద్యార్ధులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత మాట్లాడతానని హెచ్చరించారు. కలెక్టర్లతో మొదటి రోజు సమావేశం ముగిసింది. రేపు ఉదయం 9 గంటలకు రెండో రోజు కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది.
‘జిల్లా కలెక్టర్లు సంక్షేమ హాస్టళ్లలో నిద్ర చేయాలి. విద్యార్ధులందరికీ హెల్త్ చెకప్ చేయండి. రక్త హీనత సహా వేర్వేరు ఇబ్బందులు గుర్తించండి. 7,8,9,10, ఇంటర్ విద్యార్ధులకు వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా యోగా, ధ్యానం వంటి వాటిని అమలు చేయండి. పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి, రోజూ వారిని ఆడించేలా చర్యలు తీసుకోవాలి. గిరిజన విద్యార్ధులు ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికయ్యారు. సంక్షేమ శాఖల ద్వారా వెనుకబడిన విద్యార్ధుల కెరీర్ ప్లానింగ్ చేస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఏజెన్సీలోని ఆర్గానిక్ ఉత్పత్తులను ఫుడ్ పార్కు ద్వారా ప్రాసెసింగ్ చేసి ఇతర మార్కెట్లకు తరలించేలా చూడండి. గిరిజన కార్పోరేషన్ ద్వారా కొన్ని హోటళ్లు కట్టి.. వాటి మెయింటెనెన్సును కార్పోరేట్లకు ఇస్తే పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది’ అని సీఎం కలెక్టర్లతో అన్నారు.
Also Read: The Rajasaab Premieres: ప్రభాస్ ‘రాజా సాబ్’ అప్‌డేట్.. ప్రీమియర్స్ ఎప్పుడో తెలుసా?
‘ప్రకృతితో మమేకం కావడానికి గిరిజన సంప్రదాయాలను చూసేందుకు పర్యాటకం పెరిగే అవకాశం ఉంది. బ్రాహ్మణ కార్పోరేషన్లోనూ మంచి ప్రయోగం చేశారు. ప్రభుత్వ నిధులతో పాటు కమ్యూనిటీ నిధులతో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరగాలి. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం 250 ఎకరాలను కేటాయిస్తాం.. ఇది ఫుడ్ పార్కుగా అభివృద్ధి కావాలి. పీ4 కింద సంక్షేమ హాస్టళ్లను ఆడాప్ట్ చేసుకునే అంశాన్ని పరిశీలించండి’ అని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు చెప్పారు.
