Suryakumar Yadav in a never seen before avatar ahead of IND vs SA Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచి సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను గురువారం (నవంబర్ 2) శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం అవుతుంది. భారత్ ఫామ్ చూస్తే శ్రీలంకపై విజయం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు లోకల్ ప్లేయర్, టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు.
ఈ మ్యాచ్ కోసం భారత్, శ్రీలంక జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే మ్యాచ్‌కు కాస్త సమయం దొరకడంతో టీమిండియా ప్లేయర్స్ ముంబై వీదుల్లో సరదాగా గడుపుతున్నారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే తన ఇలాకాలో మారు వేషంలో చక్కర్లు కొట్టాడు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా.. టాటూలు కనపడకుండా ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నెత్తిన టోపీ, కళ్లకు గ్లాసెస్, ముఖానికి మాస్క్ ధరించాడు. రెడీ అయ్యాక తన హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చి.. పక్క రూంలో ఉన్న రవీంద్ర జడేజాను పిలిచాడు. వీడు ఎవడ్రా అన్నట్లు జడ్డు కాసేపు చూసి.. ఆపై గుర్తుపట్టాడు.
Also Read: PAK v BAN: భారత్ చేతిలో పరాజయం తీవ్రంగా బాధించింది: ఫకర్ జమాన్
ఆపై సూర్యకుమార్ యాదవ్ చేతిలో కెమెరా పట్టుకుని ముంబైలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన మెరైన్ డ్రైవ్‌కు వెళ్లాడు. కెమెరా పట్టుకుని అక్కడ ఉన్న వారితో చిట్ చాట్ చేశాడు. లోకల్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లలో ఎవరు ఇష్టం అని అడగ్గా.. రోహిత్ అని చాలా మంది చెప్పారు. ఓ అమ్మాయి మాత్రం సూర్యకుమార్ బ్యాటింగ్ బాగుంటుందని చెప్పింది. దాంతో సూర్య తన మాస్క్, క్యాప్ తీసి ఆమెకు షాక్ ఇచ్చాడు. ఆపై ఆ అమ్మాయి సూర్యతో సెల్ఫీ దిగింది. అనంతరం సూర్య అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియోను సూర్య తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
