Suryakumar Yadav: మ్యాచ్ ఏదైనా, మైదానం ఎక్కడైనా, ప్రత్యర్థి ఎవరిదైనా.. ఈ ఏడాది మాత్రం టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి పరుగులు రాబట్టడానికి తెగ కష్టపడుతున్నాడు. అయినప్పటికీ తన ప్రదర్శన పై నమ్మకంగా ఉన్నాడు టీమిండియా కెప్టెన్. తాను అవుట్ అఫ్ ఫామ్‌గా అంటే వినడానికి మాత్రం అతను సిద్ధంగా లేడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..
ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించినప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆయన 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో సూర్య బ్యాట్ నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ రావాలన్న అభిమానుల ఆశ మరోసారి వాయిదా పడింది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత ఫామ్ గణాంకాలే ఆయన ఉన్నా ఫామ్ లో లేడని స్పష్టంగా చూపిస్తున్నాయి. గత 21 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఆయన సగటు కేవలం 13.27 మాత్రమే. స్ట్రైక్ రేట్ 118.90తో మొత్తం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2025లో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 14.20 సగటుతో 213 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆయన ఒక్క అర్ధశతకం కూడా చేయకపోవడం గమనార్హం. అత్యధిక స్కోర్ నాటౌట్ 47 మాత్రమే.
SMAT 2025: నరాలు తెగే ఉత్కంఠ.. మధ్యప్రదేశ్‌పై ఒక్క పరుగు తేడాతో ఝార్ఖండ్ గెలుపు..!
సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శనపై అభిమానులే కాదు, క్రికెట్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ అయితే 2026 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుంటే శుభ్‌మన్ గిల్ కంటే సూర్య ఫామ్‌నే ఎక్కువగా ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. అయితే, ఈ విమర్శలన్నింటినీ తాజాగా సూర్యకుమార్ యాదవ్ ఖండించాడు. మూడో టీ20 మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. “నేను నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. పరుగులు రావాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయి” అని అన్నారు. తనను తాను అవుట్ ఆఫ్ ఫామ్‌గా భావించడాన్ని ఆయన స్పష్టంగా తిరస్కరించారు. “నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు… అవుట్ ఆఫ్ రన్స్ మాత్రమే” అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
