Suryakumar Yadav reached 100 sixes in T20I Cricket: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన సూర్య.. మొత్తంగా 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు తోడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్; 37 బంతుల్లో 4×4, 1×6) మెరవడంతో కీలకమైన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 4 సిక్స్‌లు బాదడంతో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రొమారియో షెఫెర్డ్ బౌలింగ్‌లో వందో సిక్స్‌ను సూర్య బాదాడు. దాంతో టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.
సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డును కూడా అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్స్‌లు కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సూర్యకుమార్ 49వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో విండీస్ వెటరన్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ అగ్ర స్ధానంలో ఉన్నాడు. లూయిస్ 42 ఇన్నింగ్స్‌లోనే 100 సిక్స్‌లు బాదాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అతధిక సిక్స్‌లు బాదింది రోహిత్ శర్మనే. రోహిత్ ఇప్పటివరకు 182 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (173) రెండో స్థానంలో ఉండగా.. ఆరోన్ ఫించ్ (125) మూడో స్థానంలో ఉన్నాడు. గప్తిల్, ఫించ్ టీ20ల్లో ఆడడం లేదు కాబట్టి రోహిత్ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశమే లేదు. రోహిత్ ఈజీగా 200 సిక్స్‌లు కొట్టగలడు. 117 సిక్స్‌లతో విరాట్ కోహ్లీ టాప్ 10లో ఉన్నాడు.