తమిళ చిత్రసీమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సీన్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాలో హీరో సూర్యకు దీటుగా, విలన్ పాత్రలో మెప్పించిన మలయాళ యంగ్ హీరో నస్లెన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. అయితే, సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న నస్లెన్కు సూర్య ఇచ్చిన ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నస్లెన్, ‘సీన్’ చిత్రంతో కోలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తెరపై సూర్యకే సవాల్ విసిరే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన కనబరిచిన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. తమ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు, నస్లెన్ నటనకు ముగ్ధుడైన సూర్య.. ఆయనకు ఒక అపురూపమైన బహుమతిని అందించారు.
ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ (Cartier) కు చెందిన క్లాసిక్ మోడల్ చేతి గడియారాన్ని సూర్య స్వయంగా నస్లెన్కు బహూకరించారు. మార్కెట్లో ఈ వాచ్ ధర సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నస్లెన్, తన చేతికి ఉన్న ఆ ఖరీదైన వాచ్‌ను చూపిస్తూ ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. “ఈ వాచ్ నాకు సూర్య అన్న ఇచ్చిన బహుమతి. దీని గురించి ఒక మంచి వేదికపై అందరితో పంచుకోవాలని ఇన్ని రోజులు సరైన సమయం కోసం ఎదురుచూశాను” అంటూ నస్లెన్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. తోటి నటుడి ప్రతిభను గుర్తించి, ఇంతటి భారీ బహుమతిని అందించిన సూర్య మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

