గుజరాత్‌లోని సూరత్‌లో ఓ చేపల మార్కెట్‌కు ప్రధాని మోడీ పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. నాన్పురాలోని లక్కడ్‌కోట్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన హోల్‌సేల్ చేపల మార్కెట్ ప్రవేశద్వారం దగ్గర ‘శ్రీ నరేంద్ర మోడీ హోల్‌సేల్ ఫిష్ మార్కెట్’ పేరుతో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. అందులో ప్రధాని మోడీ ఫొటోతో పాటు సూరత్ ఫిష్ మర్చంట్ అసోసియేషన్ పేరు కూడా ఉంది. అయితే దీనిపై కొందరు స్థానిక చేపల వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ శాఖాహారి కావడంతో ఆయన పేరును చేపల మార్కెట్‌కు పెట్టడం సరైన నిర్ణయం కాదని కొందరు వ్యాపారులు ప్రశ్నించారు. “నరేంద్ర మోడీ జీవితంలో ఎప్పుడూ సీఫుడ్ తినలేదు. ఆయన స్వచ్ఛమైన శాఖాహారి. అలాంటప్పుడు ఈ బోర్డును ఏర్పాటు చేయకూడదు” అని చేపల వ్యాపారి సురేంద్ర లష్కరీ వ్యాఖ్యానించారు.
ఈ వివాదంపై సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వివరణ ఇచ్చింది. మార్కెట్‌కు ఇప్పటివరకు అధికారికంగా ప్రధాని మోడీ పేరు పెట్టలేదని స్పష్టం చేసింది. మార్కెట్‌కు ఆ పేరు పెట్టాలన్న ప్రతిపాదన ప్రస్తుతం అనుమతి కోసం పెండింగ్‌లో ఉందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిపింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ సెంట్రల్ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డీ గంజావాలా మాట్లాడుతూ.. మార్కెట్‌కు మోడీ పేరు పెట్టాలని కోరుతూ (సూరత్ ఫిష్ మర్చంట్ అసోసియేషన్ ) స్టాండింగ్ కమిటీ చైర్మన్, సెంట్రల్ జోన్ అధికారులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసిందని తెలిపారు. అయితే అధికారిక తీర్మానం రాకముందే మార్కెట్ దగ్గర బోర్డును ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లామని.. బోర్డును తామే తొలగిస్తామని వారు మౌఖికంగా హామీ ఇచ్చారని గంజావాలా తెలిపారు.
మరోవైపు మార్కెట్‌కు మోడీ పేరు పెట్టాలన్న తమ ప్రతిపాదనను సూరత్ ఫిష్ మర్చంట్ అసోసియేషన్ సమర్థించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ మార్కెట్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని అసోసియేషన్ తెలిపింది. SFMA అధ్యక్షుడు కల్పేశ్ నవ్సారివాలా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ పథకం కింద మార్కెట్ నిర్మాణానికి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3 కోట్లు అందాయని తెలిపారు. మత్స్యకారులు, చేపల వ్యాపారులకు మద్దతుగా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.
మార్కెట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3 కోట్ల నిధులు అందిన విషయాన్ని ఎస్ఎంసీ అధికారి ఆర్డీ గంజావాలా కూడా ధృవీకరించారు. మిగిలిన నిర్మాణ వ్యయాన్ని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భరించినట్లు తెలిపారు. ఈ హోల్‌సేల్ చేపల మార్కెట్‌ను మొత్తం రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు ఎస్ఎంసీ అధికారి తెలిపారు. ఇందులో 80 పెద్ద హోల్‌సేల్ స్టాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ దగ్గర ప్రధాని మోడీ పేరుతో ఏర్పాటు చేసిన బోర్డు అధికారికం కాదని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అధికారికంగా పేరు ఖరారు చేసేందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది.

