NTV Telugu Site icon

MLAs Defection Case: పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన స్పీకర్..

Supreme Court

Supreme Court

నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. “ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరయింది కాదు. అనర్హత చట్టం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారు. పిటిషనర్లు దురుద్దేశంగా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ను ఆశ్రయించిన వెంటనే కోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయండి.” అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్నారు.

READ MORE: MMTS Incident: ఎంఎంటీఎస్‌లో లైంగిక దాడికి యత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు…

కాగా.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు. కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించి నెలలు గడుస్తున్నా స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. అయితే.. తెలంగాణ స్పీకర్‌ కార్యాలయం మాత్రం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటున్నట్లు చెబుతోంది. గత విచారణ సందర్భంగా స్పీకర్, స్పీకర్‌ కార్యదర్శి, ప్రభుత్వం, ఎన్నికల సంఘం, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22వ తేదీలోపు దీనిపై రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా స్పీకర్ స్పందించి కౌంటర్ దాఖలు చేశారు.