Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేడు (బుధవారం) జరుగుతున్న విచారణ సందర్భంగా.. “చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు” అంటూ జస్టిస్ బి. ఆర్.గవాయ్ వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. అయితే, ఈ విచారణలో.. నాశనం చేసిన వందల ఎకరాల అడవులను మీరు ఎలా పునరుద్ధరిస్తారు? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలకు తావులేదని స్పష్టం చేసింది. అలాగే మేము చూసిన వీడియోలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అడవిలో నివసించే జంతువులు షెల్టర్ కోసం పరుగులు తీయగా, వీధుల్లో ఉండే కుక్కలు వాటిని కరిచాయని సమాచారం వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
1996లో ఇచ్చిన తీర్పును విస్మరించి అధికారులు తమకు తాము మినహాయింపులు ఇచ్చుకుంటే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రైవేట్ ఫారెస్ట్ లలో సైతం చెట్లను నరికితే అదే తీరు కొనసాగుతుందని, అటువంటి చర్యలను సీరియస్‌గా పరిగణిస్తామని పేర్కొంది. భూముల తాకట్టు అంశాలతో తమకు సంబంధం లేదని, నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ఆదేశించింది. డజన్ల బుల్డోజర్లతో వంద ఎకరాలలోని చెట్లను ఎందుకు తొలగించారు? ఇది ఎలా సరైన చర్య అవుతుందని ప్రశ్నించింది.
అభివృద్ధి అవసరమేనని, కానీ అది పర్యావరణాన్ని నాశనం చేసేలా ఉండకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. సిటీకి గ్రీన్ లంగ్ స్పేస్ అవసరం. వన్యప్రాణుల రక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాశనం చేసిన అడవులను ఎలా రీస్టోర్ చేస్తారో స్పష్టం చెయ్యండి… అంటూ కోర్టు ప్రశ్నించింది. చెట్ల నరికివేతకు ముందే అనుమతులు తీసుకోవాల్సింది అంటూ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. మొత్తంగా, చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఈ అంశంపై తదుపరి విచారణను మే 15 కు వాయిదా వేసింది. అప్పటి వరకు ‘స్టేటస్ కో’ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.