NTV Telugu Site icon

Supreme Court: శరద్‌ పవార్‌ పేరు, ఫొటోపై ఎన్సీపీకి కీలక ఆదేశాలు

Suprem Coure

Suprem Coure

సార్వత్రిక ఎన్నికల వేళ అజిత్‌ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో శరద్‌ పవార్‌ ఫొటో, పేరు ఉపయోగించొద్దని ఎన్సీపీకి న్యాయస్థానం ఆదేశించింది.

ఎన్నికల ప్రచారంలో శరద్‌ పవార్‌ పేరు, ఫొటో ఉపయోగించవద్దని అజిత్ పవార్‌ వర్గానికి సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. ఈ మేరకు హామీ ఇవ్వాలని కోరింది. లేనిపక్షంలో అజిత్ వర్గానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తన పేరు, ఫొటోను అజిత్ వర్గం ఉపయోగించకుండా ఆదేశాలివ్వాలని శరద్‌ పవార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

ప్రజాదరణపై నమ్మకం ఉన్నప్పుడు సొంత ఫొటోనే ఉపయోగించాలని అజిత్ పవర్‌కు కోర్టు సూచించింది. ఇకపై శరద్ పవార్‌ ఫొటో ఉపయోగించొద్దని మీ కార్యకర్తలకు చెప్పాలని ఆదేశించింది. ఆ పని చేయలేకపోతే.. మేం ఆదేశాలు ఇస్తామని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై మార్చి 19లోగా స్పందన తెలియజేయాలని అజిత్‌ పవార్‌ వర్గానికి ఆదేశించింది.

అజిత్‌ పవార్‌ గతేడాది ఎన్సీపీ నుంచి విడిపోయి బీజేపీ-షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీలో సంక్షోభం తలెత్తింది. దీంతో పార్టీ ఎవరిదనే విషయంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పరిష్కరించింది. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించింది. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించింది. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్‌ వర్గం చీలిక తర్వాత శరద్‌ పవార్‌ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోయారు. ప్రస్తుతం శరద్ పవార్ వెంట 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే శరద్ పవార్ కూడా కొత్త పార్టీ స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీ నుంచే పోటీ చేయనున్నారు.