సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని గతంలో హైకోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా సోమవారం నిరాకరించింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, అతని సహచరులు ఈడీ అధికారులపై దాడి చేశారని న్యాయస్థానం స్పష్టం చేసింది.
సందేశ్‌ఖాలీ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై షాజహాన్ షేక్, అతని సహచరులు చేసిన దాడికి సంబంధించిందిగా అభిప్రాయపడింది. దీంతో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సందేశ్‌ఖాలీ కేసును సీబీఐకి బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించగా.. పశ్చిమ బెంగాల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీర్పులో చేసిన ప్రతికూల వ్యాఖ్యలను బహిర్గతం చేయాలని ఆదేశించింది.
సందేశ్ ఖాలీ కేసులో బెంగాల్ పోలీసులు పూర్తిగా పక్షపాత ధోరణి అవలంభించారని కలకత్తా హైకోర్టు పేర్కొంది. నిందితులను రక్షించడానికే దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును తీవ్రంగా మందలించింది. పోలీసుల తీరు బాధితులకు విశ్వాసాన్ని కలిగించలేకపోయిందని అభిప్రాయపడింది. కేసు తీవ్రతను ఎత్తిచూపుతూ.. నిందితుడు షాజహాన్‌తో సహా రాజకీయంగా శక్తివంతమైన వ్యక్తుల ప్రమేయం ఉన్నందున.. న్యాయమైన పూర్తి దర్యాప్తు అవసరమని హైకోర్టు నొక్కి చెప్పింది.
అంతేకాకుండా ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడం కంటే మెరుగైన కేసు మరొకటి ఉండదని కూడా హైకోర్టు ప్రకటించింది. తాజాగా హైకోర్టు తీర్పును కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. ఇక సీబీఐ దర్యాప్తు వేగవంతమై అవకాశం ఉంటుంది.
నిరసనలు, ఆందోళనలతో సందేశ్‌ఖాలీ ప్రాంతం అట్టుడుకింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని అనుచరులు భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళలు ఆందోళనలు చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా ఆందోళనలు చేశారు. మొత్తానికి కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి సీబీఐకి అప్పగించింది.
ఇకపోతే ఇటీవల ప్రధాని మోడీ బెంగాల్ టూర్‌లో సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా వారి బాధలను ఓపికగా విన్నారు. అనంతరం సీఎం మమతా బెనర్జీ సర్కార్‌పై మోడీ ధ్వజమెత్తారు. నిందితులకు మమత కుమ్ముకాశారని ఆరోపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల మహిళల దినోత్సవం సందర్భంగా సీఎం మమత కూడా పెద్ద ఎత్తున మహిళలతో కలిసి భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. బెంగాల్ మహిళలకు సేఫ్ జోన్ అని సందేశం ఇచ్చారు.