Site icon NTV Telugu

Supreme Court: శివసేన వివాదం.. ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో

Shivsena

Shivsena

Supreme Court: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్‌ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన పేరు, పార్టీ గుర్తును కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. కానీ, థాక్రే వర్గ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏక్‌నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక పార్టీ పేరు, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని థాక్రే వర్గం సుప్రీంను అభ్యర్థించగా.. అందుకు మాత్రం నిరాకరించింది. ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.

Read Also: Locked Self: ఆ భయంతో.. మూడేళ్లుగా గృహనిర్బంధంలోనే ఉండిపోయిన తల్లీకొడుకులు!

ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక.. చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు ఉద్ధవ్ థాక్రే వర్గానికి సూచించింది. శివసేన ఉద్దవ్‌ బాలాసాహెబ్‌ థాక్రే పేరుతో పార్టీ పేరును.. వెలుగుతున్న టార్చ్‌ సింబల్‌ను గుర్తుగా ఉపయోగించుకోవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఈ సందర్భంగా పిటిషనర్‌కు సూచించారు. ఠాక్రే వర్గానికి చెందిన చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు ఎలాంటి విప్ జారీ చేయబోమని, ఏ చర్యలు ప్రారంభించబోమని ఏక్‌నాథ్ షిండే వర్గం తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. అనంతరం విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Exit mobile version