Site icon NTV Telugu

Supreme Court: ఈసీ నియామకంపై సుప్రీం అసహనం.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు?

Supreme Court

Supreme Court

Supreme Court: అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియామకం ఎందుకంత వేగంగా చేపట్టాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాలను వేగంగా ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీఈసీ, ఈసీ నియామకాలపై దాఖలైన పిటిషన్‌లపై.. సుప్రీం కోర్టులో విచారణ గురువారం కొనసాగింది. ఈ క్రమంలో వరుసగా మూడవ రోజు విచారణలోనూ కేంద్రం తీరును తీవ్రంగా ధర్మాసనం తప్పుబట్టింది. తాజా ఎన్నికల కమిషనర్‌ నియామకంపై ఎందుకు అంత తొందర పడ్డారని ప్రశ్నించింది.

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అరుణ్‌ గోయల్‌ నియామక దస్త్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రం హడావుడిగా ఆయనను ఈసీగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గురువారం తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కోసం కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా నవంబర్‌ 19వ తేదీన రిటైర్డ్‌ బ్యూరోక్రాట్‌ అరుణ్‌ గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాలను కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి గురువారం సమర్పించారు.

ఆ ఫైళ్లను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఇదే నియామకమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాల గురించి మాట్లాడట్లేదని.. నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నామని పేర్కొంది. గోయల్ ఫైల్‌ను ఎందుకంత హడావిడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. దస్త్ర్లాలు ప్రవేశపెట్టినా రోజునే అపాయింట్‌మెంట్ ఎలా జరిగిందని ప్రశ్నించింది. నవంబర్‌ 18న అంత హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?. నవంబర్‌ 18వ తేదీనే ఫైల్‌ మూవ్‌ చేసి.. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు అని కేంద్రాన్ని సూటిగా నిలదీసింది రాజ్యాంగ ధర్మాసనం. ‘‘న్యాయ మంత్రిత్వ శాఖ నాలుగు పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఆ ఫైల్‌ నవంబర్‌ 18వ తేదీన ముందుకు కదిలింది. అదేరోజు ప్రధాని కూడా పేరును ప్రతిపాదించారు. ఈ విషయంలో మాకు మీతో ఎలాంటి సంఘర్షణ అక్కర్లేదు. కానీ, ఎందుకు అంత తొందర అనే విషయాన్ని మాత్రమే మాకు తెలియజేయండి’’ అని కేంద్ర తరపున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్‌ వెంకటరమణిని ప్రశ్నించింది. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే… వారిలో చిన్నవాడైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?’’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. మే 15 నుంచి ఈసీ పోస్టు ఖాళీగా ఉందని.. నవంబరు 18 వరకు ఏం జరిగిందో చెప్పాలని రాజ్యాంగ ధర్మాసనం అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. ఈ విచారణ ద్వారా కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోకూడని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తెలిపారు.

ఎన్నికల సంఘంలో నియామకాల కోసం కొలీజియం లాంటి వ్యవస్థ అవసరమంటూ దాఖలైన పిటిషన్‌లపై.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వరుసగా 3 రోజులపాటు విచారణ చేపట్టింది. గురువారం నాటికి వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

Anti Hijab Protests: మహ్సా అమిని చంపబడలేదు, మరణించింది.. ఇరాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈ విచారణ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోయింది. ఇదిలా ఉండగా.. కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అటార్నీ జనరల్‌ వెంకటరమణి మాత్రం కాస్త దురుసుగా వాదించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించకుండా పరిశీలనలు చేయవద్దంటూ ధర్మాసనాన్ని ఆయన గట్టిగా కోరారు. మరోవైపు వాదనల సమయంలో ఏజీ వాదిస్తుండగా న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించబోతుండగా.. ఏజీ తీవ్రంగా స్పందించారు. ‘‘దయచేసి మీరు కాసేపు నోరు మూయండి’ అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. రాసేపటికి బెంచ్‌లో భాగమైన జస్టిస్ అజయ్ రస్తోగి కలుగజేసుకుని ఏజీ వెంకటరమణితో.. “మీరు కోర్టు చెప్పేది జాగ్రత్తగా వినండి.. ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మేము వ్యక్తిగత అభ్యర్థులపై కాదు, ప్రక్రియపై ఉన్నాము.” అని అన్నారు. కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కట్టుబడి ఉన్నానని అటార్నీ జనరల్ చెప్పారు.

Exit mobile version