Site icon NTV Telugu

Supreme Court: శివసేనకు చుక్కెదురు.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’

Uddhav Thackeray

Uddhav Thackeray

ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయి, పార్టీని కోల్పోయే పరిస్థితికి ఉద్ధవ్ ఠాక్రేకు ఏర్పడింది. మెజారీటీ ఎమ్మెల్యేలు సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు ఇస్తుండటం, మూడింట రెండొంతుల మెజారిటీ ఏక్ నాథ్ షిండేకు ఉంది. వరస ఎదురుదెబ్బలు తగులుతున్న శివసేన, ఉద్ధవ్ వర్గానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది.

శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు, సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు, 15 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని.. అనర్హత వేటు తేలే వరకు వారిని అసెంబ్లీలోకి రానీయకుండా నిలువరించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు ఎమ్మెల్యే సునీల్ ప్రభు వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సుప్రీంను కోరారు శివసేన తరుపు లాయర్ కపిల్ సిబల్. అయితే ఈ పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్ట్ ‘నో’ చెప్పింది. అత్యవసర విచారణ చేయాల్సిన అవసరం లేదని..అన్ని పిటిషన్లను కలిపి జూలై 11న విచారణ చేపడుతామని వెల్లడించింది.

Read Also:Pakistan Economic Crisis: కరెంట్ కష్టాలు.. ఇంటర్నెట్ బంద్

ఇటీవల ఏక్ నాథ్ షిండే శివసేనలోని 39 మంది ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేశారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను దారికి తీసుకురావడానికి ఉద్ధవ్ ఠాక్రే అనర్హత అస్త్రాన్ని ప్రయోగించారు. ఏక్ నాథ్ షిండేతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ అనర్హతపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏక్ నాథ్ షిండే వర్గం. ఈ అంశంపై కూడా సుప్రీం కోర్టు జూలై 11న విచారిస్తామని వెల్లడించింది. ఇదిలా ఉంటే మారిన రాజకీయ పరిస్థితుల్లో గురువారం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

 

Exit mobile version