No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..

No Petrol

No Petrol

దేశంలో చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా వ్యవస్థలో ఇది అత్యంత విచారకరమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల నమోదిత వాహనాల్లో దాదాపు 56 శాతం ఎలాంటి థర్డ్ పార్టీ బీమా లేకుండానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయని సంచలన గణాంకాలను వెల్లడించింది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా పోతోందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా లభించే జీవించే ప్రాథమిక హక్కును భంగపరచడమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ తీవ్రమైన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిలిపివేసే ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ పైలట్ ప్రాజెక్ట్‌ను పరిశీలించాలని MoRTH, IRDAI లతో పాటు పెట్రోలియం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించేందుకు రోడ్లపై ఉన్న ANPR కెమెరాలను ‘విహాన్’ (VAHAN) డేటాబేస్‌తో అనుసంధానించి, నేరుగా ఈ-చలాన్లు జారీ చేయాలని తెలిపింది. ట్రాఫిక్ పోలీసులకు తక్షణ తనిఖీల కోసం డిజిటల్ పరికరాలను అందించాలని సూచించింది. నూతన ప్రైవేట్ కార్లకు నిర్బంధ థర్డ్-పార్టీ బీమా కాలాన్ని 3 నుంచి 4 ఏళ్లకు, ద్విచక్ర వాహనాలకు 5 నుంచి 6 ఏళ్లకు పెంచాలని ఐఆర్‌డీఏఐని ఆదేశించింది. వాహన బీమాను సులభతరం చేసేందుకు ‘నాలుగు అంచెల’ పాలసీ విధానాన్ని ప్రతిపాదించింది. పౌరులు కూడా వాహనాల బీమా వివరాలను తనిఖీ చేసి నివేదించే వెసులుబాటు కల్పించాలని తెలిపింది.