Supreme Court: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత పరిరక్షణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు నేడు (2026 అక్టోబర్ 26) కీలక తీర్పు వెలువరించే అవకాశముంది. అటవీ భూముల ధ్వంసం, పర్యావరణ పరిరక్షణను అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం దాఖలు చేసుకున్న ‘సుమోటో రిట్ పిటిషన్ (సివిల్) నం. 3/2025’ (ఇన్ రీ: కంచా గచ్చిబౌలి ఫారెస్ట్, తెలంగాణ రాష్ట్రం)పై తుది తీర్పు కోసం జాబితా అయింది. గచ్చిబౌలి పరిధిలోని కంచా ప్రాంతంలో భారీ యంత్రాలతో వందలాది చెట్లను నేలమట్టం చేస్తున్నారని, వన్యప్రాణుల ఉనికికి ముప్పు వాటిల్లుతోందని పత్రికల్లో వచ్చిన కథనాలను అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి గతంలోనే తక్షణమే చెట్ల నరికివేతను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అటవీ సంరక్షణ నియమాలు (2023) ప్రకారం నియమించిన నిపుణుల కమిటీ సమగ్ర ప్రక్రియ పూర్తి చేయకముందే ప్రభుత్వం హడావుడిగా భారీ విస్తీర్ణంలో చెట్లను తొలగించడంపై ధర్మాసనం గతంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐటీ పార్కులు లేదా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో చేపట్టవచ్చని, కానీ ధ్వంసమైన అటవీ పర్యావరణాన్ని యథాతథ స్థితికి పునరుద్ధరించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సాధికార కమిటీ (CEC) సమర్పించిన నివేదికలు, వాదనలు పూర్తయిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే ఈ తీర్పు నగరంలోని అటవీ భూముల భవితవ్యానికి అత్యంత కీలకంగా మారనుంది.

