Site icon NTV Telugu

Supreme Court: ఏపీ ప్రభుత్వ సిట్‌.. నేడు సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court

Supreme Court

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.. గత ప్రభుత్వం (చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం) నిర్ణయాలపై దర్యాప్తు కోసం ‘సిట్’ ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌నేతృత్వంలోని ఏపీ సర్కార్‌.. అయితే, ‘సిట్’ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా సవాల్‌ చేయగా.. సిట్‌’పై స్టే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇక, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం.. దీంతో.. సుప్రీం ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.

Read Also: Telangana Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్

మరోవైపు ఈ కేసు విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది.. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని వ్యాఖ్యానించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని, ఈ కేసును సీబీఐ అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం.. దీంతో.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠగా నెలకొంది.. సిట్‌పై ఏపీ హైకోర్టు స్టేను కొనసాగిస్తుందా? లేదా సిట్‌ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version