NTV Telugu Site icon

Avinash Reddy: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట..

Ys Avinash Reddy

Ys Avinash Reddy

Avinash Reddy: సుప్రీంకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందుస్తు బెయిల్‌ కోసం ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకునే హక్కు అవినాష్‌ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు బెంచ్‌ తేల్చి చెప్పింది. మంగళవారం విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌కు వెళ్లాలని అవినాష్‌కి జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ నర్సింహలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సూచించింది. అదే సమయంలో.. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్ సునీతా రెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా.. ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లదలచుకోలేదని.. ఏదైనా ఉంటే హైకోర్టులో చెప్పుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై సమగ్ర వాదనలు విన్న తర్వాతే హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 25న అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపనుంది.

Read Also: Electric two-wheelers: జూన్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు.. కారణం ఇదే..

తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ జరిపే వరకు కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి పరిష్కరించే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. అంతకుముందు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ విచారణకు ఇప్పటికే ఏడు సార్లు హాజరైన విషయాన్ని కోర్టుకు వివరించారు. ఎంపీ విచారణకు సహకరించారని.. ఈ కేసులో ఆయన నిందితుడిని కాదన్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యారని.. ఎంపీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు.