Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందా? అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. 17ఏపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. సెక్షన్ 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ పేర్కొనగా.. అసలు సెక్షన్ 17ఏ వర్తించదన్నారు జస్టిస్ బేలా.. దీంతో, ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.. 17ఏపై ఎలాంటి తీర్పు ఇవ్వలేదు ద్విసభ్య ధర్మాసనం.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కు నివేదిస్తున్నాం.. 17ఏ అన్వయించడంలో మాకు భిన్నాభిప్రాయాలున్నాయన్నారు జస్టిస్ అనిరుద్ధ్ బోస్.. దీంతో.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ బాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో పడినట్టు అయ్యింది.
కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరారు.. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. విస్తృత ధర్మాసనానికి ఈ కేసు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేసింది ద్విసభ్య ధర్మాసనం.. దీంతో, చంద్రబాబు పిటిషన్‌పై సీజేఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.
ఇక, చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు స్ప్లిట్ జడ్జిమెంట్ ఇచ్చిందని.. ఈ కేసును ముగ్గురు లేదా ఐదుగురు సభ్యుల ధర్మాస్నానికి ప్రధాన న్యాయమూర్తి నివేదిస్తారని రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు ఎదురు దెబ్బనని ఆయన అన్నారు. చంద్రబాబు కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ తో పాటు అరెస్టును కూడా సుప్రీంకోర్టు సమర్థించిందని అంటున్నారు అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి.