పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ స్పందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రిగారి ప్రవేశం పాటకు ఊపిరులూదింది అన్నారు. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి గారు. సాహితీ విరించి సీతారామశాస్త్రిగారికి నా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, లక్షలాది అభిమానులకు నా సానుభూతి అని తెలిపారు. అయితే సిరివెన్నెల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు.