Verdict to be out on Same Gender Marriage form Supreme Court: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైందని కాదని స్పష్టం చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని పేర్కొంది.
కోర్టులు చట్టాలను రూపొందించవని, కానీ వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాహ వ్యవస్థ స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే మనం స్వాతంత్ర్యానికి ముందు రోజులకు వెళ్లినట్లేనన్నారు. ప్రత్యేక వివాహ చట్టం అవసరమా? లేదా? అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని సీజేఐ తెలిపారు.
స్వలింగ సంపర్కుల బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీజేఐ డీవై చంద్రచూడ్ సూచించారు. వివాహేతర జంటలతో పాటు స్వలింగ సంపర్కులు బిడ్డలను దత్తత తీసుకోవచ్చన్నారు. భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదని చెప్పారు. ఇక సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్‌కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత నేడు తీర్పును వెలువరించింది.
Also Read: Salman Khan: విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’.. సల్మాన్ ఖాన్ ఫిదా!
2018 సెప్టెంబర్‌లో స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. సాంస్కృతిక విలువలను పక్కనపెట్టి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. స్వలింగ సంపర్కం నేరం కాదని కోర్టు చెప్పినా.. తమకు సామాజిక అంగీకారం లభించడం లేదని, తమపై వివక్ష సాగుతూనే ఉందని లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్.. వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పిన అనంతరం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కావాలని డిమాండ్ చేశారు. పెళ్లిళ్ళను చట్టబద్ధమైనవిగా గుర్తించాలని 2020లో ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పిటిషన్లు చేరాయి.