Super Star Krishna : నటశేఖర కృష్ణ తన కంటే సీనియర్స్ తోనూ, తరువాతి తరం వారితోనూ, కుర్ర హీరోలతోనూ నటించి అలరించారు. అలా నాలుగు తరాల స్టార్స్ తో నటించిన స్టార్ హీరోగా కృష్ణ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.
తన సీనియర్స్ అయిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ కృష్ణ స్టార్ డమ్ రాకముందు, స్టార్ అయిన తరువాత నటించారు. ఓ స్టార్ హీరో చిత్రంలో మరో స్టార్ నటించినప్పుడే సదరు చిత్రాలను మల్టీస్టారర్స్ అనడం కద్దు. అలా కృష్ణ స్టార్ అనిపించుకున్నాక యన్టీఆర్ తో “దేవుడు చేసిన మనుషులు, వయ్యారిభామలు-వగలమారి భర్తలు” చిత్రాలలో నటించారు. ఏయన్నార్ తో అలా “హేమాహేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయచదరంగం”లో అభినయించారు కృష్ణ.
ఇక తన తరం హీరో అయిన శోభన్ బాబుతో అంతకు ముందు పలు చిత్రాలలో నటించినప్పటికీ, వారిద్దరూ స్టార్స్ అనిపించుకున్నాక కలసి నటించిన చిత్రాలనే ‘మల్టీస్టారర్స్’గా పరిగణించాల్సి వస్తుంది. పైగా ఇద్దరికీ సమాన ప్రాధాన్యమున్న పాత్రలతో రూపొందిన చిత్రాలనే అలా లెక్కించాల్సి ఉంటుంది. అలా వారిద్దరూ కలసి “మంచి మిత్రులు, పుట్టినిల్లు – మెట్టినిల్లు, గంగ- మంగ, కురుక్షేత్రం, మండేగుండెలు, కృష్ణార్జునులు, ముందడుగు, ఇద్దరుదొంగలు, మహాసంగ్రామం” చిత్రాలలో నటించి అలరించారు.
కృష్ణంరాజుతో కలసి కృష్ణ అనేక చిత్రాలలో నటించారు. కృష్ణ హీరోగా రూపొందిన పలు చిత్రాలలో కృష్ణంరాజు నెగటివ్ కేరెక్టర్స్ ధరించారు. అడపాదడపా కేరెక్టర్ రోల్స్ లోనూ కనిపించారు. అయితే వారిద్దరూ హీరోలుగా నటించిన “మనుషులు చేసిన దొంగలు, కురుక్షేత్రం, అడవిసింహాలు, యుద్ధం” వంటి చిత్రాల్లో సమాన స్థాయి పాత్రలే ధరించారు. కాగా ఆ పై కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘విశ్వనాథనాయకుడు’లో కృష్ణంరాజు శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించారు. అలాగే కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘ఇంద్రభవనం’లోనూ వారిద్దరూ నటించారు. బాలకృష్ణ కథానాయకునిగా తెరకెక్కిన ‘సుల్తాన్’లో కృష్ణ, కృష్ణంరాజు నటించారు.
తన తరువాతి తరం స్టార్ హీరోలతోనూ కృష్ణ నటించి మురిపించారు. చిరంజీవికి గుర్తింపు సంపాదించి పెట్టిన “కొత్త అల్లుడు, కొత్త పేట రౌడీ” చిత్రాలలో కృష్ణ కథానాయకుడు. కాగా, వారిద్దరూ కలసి ‘తోడుదొంగలు’లో హీరోలుగా నటించారు. బాలకృష్ణతో కలసి కృష్ణ నటించిన ఏకైక చిత్రం ‘సుల్తాన్’. బాలకృష్ణ అన్న హరికృష్ణతోనూ కృష్ణ కలసి ‘శ్రావణమాసం’ చిత్రంలో నటించడం విశేషం! నందమూరి నటవంశం మూడోతరం హీరో తారకరత్న హీరోగా రూపొందిన ‘తారక్’లోనూ కృష్ణ కీలక పాత్రలో కనిపించారు.
నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘వారసుడు’లో కృష్ణ నాగ్ కు తండ్రిగా నటించారు. నాగ్ హీరోగా రూపొందిన ‘రాముడొచ్చాడు’లోనూ కృష్ణ అతిథి పాత్రలో కనిపించారు. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘రవన్న’లోనూ కృష్ణ కీలక పాత్ర పోషించారు. రవితేజ హీరోగా రూపొందిన ‘బలాదూర్’లో హీరోకు పెదనాన్నగా కృష్ణ కనిపించారు. ఆలీని హీరోగా పరిచయంచేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందంచిన ‘యమలీల’లో “జుంబారే జుమ్ జుమ్…” అంటూ సాగే పాటలో నర్తించి మురిపించారు కృష్ణ. శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘సేవకుడు’లో కేమియో అప్పియరెన్స్ ఇచ్చారు కృష్ణ. శివాజీ హీరోగా తెరకెక్కిన ‘సత్యభామ’లోనూ కృష్ణ స్పెషల్ అప్పియరెన్స్ తో అలరించారు. ఇక సాయికుమార్ తనయుడు ఆది హీరోగా రూపొందిన ‘సుకుమారుడు’లోనూ కృష్ణ ప్రముఖ పాత్ర ధరించారు. ఇక లేడీ సూపర్ స్టార్ గా సాగిన విజయశాంతితో దాసరి తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ’లోనూ కృష్ణ కీ రోల్ లో కనిపించారు.
తన నటవారసుల్లో రమేశ్ బాబుతో కలసి కృష్ణ “ముగ్గురు కొడుకులు, ఎన్ కౌంటర్” చిత్రాల్లో నటించారు. చిన్నకొడుకు మహేశ్ బాబు బాలనటునిగా ఉన్న సమయంలో అనేక చిత్రాలలో నటించిన కృష్ణ, ఆయన హీరోగా పరిచయమైన ‘రాజకుమారుడు’లోనూ కీలక పాత్రలో కనిపించారు. అలాగే ‘వంశీ’ చిత్రంలో వీరిద్దరూ కలసి నటించి అభిమానులను అలరించారు. మహేశ్ కౌబోయ్ మూవీ ‘టక్కరిదొంగ’ చివరి సీన్ లో కృష్ణ దర్శనమిచ్చి ఫ్యాన్స్ కు ఆనందం పంచారు.
తమిళనాట సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీకాంత్ స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లోనే కృష్ణతో కలసి “అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, రామ్-రాబర్ట్-రహీమ్” వంటి చిత్రాలలో నటించారు. విక్రమ్ హీరోగా రూపొందిన ‘కందస్వామి’ తమిళ చిత్రంలోనూ కృష్ణ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రం తెలుగులో ‘మల్లన్న’గా జనం ముందు నిలచింది. ఇలా నాలుగు తరాల స్టార్స్ తో నటించి కృష్ణ తనదైన బాణీ పలికించడం విశేషం!