Super Over For Sri Lanka vs India 3rd ODI: ఆగష్టు 2న కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మ్యాచ్ టైగా ముగిసింది కాబట్టి ‘సూపర్ ఓవర్’ ఆడిస్తారని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు. మ్యాచ్ డ్రా అయినట్లు అధికారులు ప్రకటించారు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య మొదటి వన్డే టైగా ముగియడంతో ఐసీసీ నిబంధనలకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అయితే నిబంధనను అమలు చేయకుండా మ్యాచ్ అధికారులు తప్పు చేశారని తర్వాత తేలింది. ఐసీసీ రూల్స్ ప్రకారం తొలి వన్డేలో సూపర్ ఓవర్ నిర్వహించే అవకాశం ఉందని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) అధికారి ఒకరు ధృవీకరించారు. ఐసీసీ టోర్నీలో మాత్రమే సూపర్ ఓవర్ ఉంటుందని అంపైర్లు భావించారని సదరు అధికారి చెప్పారు.
Also Read: IND vs SL: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్డే.. సమం చేస్తారా? భారత తుది జట్టులో మార్పులు
ఒకవేళ భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్‌ను నిర్వహిస్తారట. ఈ విషయాన్ని ఐసీసీ అధికారి ఒకరు ధృవీకరించారని ఓ స్పోర్ట్స్ ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కొలంబోలో ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ టై కాగా.. రెండో మ్యాచ్ లంక గెలిచింది.