NTV Telugu Site icon

SA20 2025: ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్‌​

Srh

Srh

SA20 2025: సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్ రూబిన్ హెర్మాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లో 81 పరుగులు చేయడంతో రాయల్స్ మాంచి స్కోర్ సాధించగలిగింది. అతడికి ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ (59 పరుగులు) తోడుగా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఓవర్టన్, మార్కో జానెసన్, బార్టమన్, మార్‌క్రమ్ తలా వికెట్‌ తీశారు.

Also Read: Maha Kumbh Mela 2025: మరోమారు మహా కుంభమేళాలో చెలరేగిన మంటలు

176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ విజృంభించింది. ఓపెనర్ టోనీ డి జోర్జి రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 పరుగులు చేసిన టోనీ విజయానికి పునాది వేసాడు. అతనికి జోర్డాన్ హెర్మాన్ (69 పరుగులు) తోడుగా నిలవడంతో 19.2 ఓవర్లలో సన్‌రైజర్స్ విజయం సాధించింది. రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలా వికెట్‌ తీసినప్పటికీ మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక శనివారం (ఫిబ్రవరి 8)న జోహాన్స్‌బర్గ్ వేదికగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్, ఎంఐ కేప్‌టౌన్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. కేప్‌టౌన్ జట్టు తన తొలి ఫైనల్‌కు సిద్ధమవుతుండగా, సన్‌రైజర్స్ జట్టు ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. అయిదా మార్‌క్రమ్ సారథ్యంలో మూడో టైటిల్ కోసం సన్‌రైజర్స్ మరోసారి బరిలోకి దిగుతోంది.
సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ – ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి సంబంధించిన జట్టే.