NTV Telugu Site icon

IND vs NZ Toss: భారత్ టాస్ గెలిస్తే.. రోహిత్ శర్మకు సన్నీ సలహా ఇదే!

Sunil Gavaskar New

Sunil Gavaskar New

Sunil Gavaskar React on IND vs NZ Semi Final 2023 Toss: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో జరగనున్న సెమీ ఫైనల్‌-1పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబైలోని వాంఖడే మైదానంలో మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుండగా.. 1.30కి టాస్ పడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటుంది? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇందుకు కారణం ఈ ప్రపంచకప్‌లో ముంబై పిచ్ వ్యవహరిస్తున్న తీరు. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం టాస్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదంటున్నారు. భారత బౌలర్ల ఫామ్‌ను చూస్తుంటే.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నా ప్రత్యర్థిని కట్టడి చేయగలరన్నారు.

టాస్‌పై పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సునీల్ గవాస్కర్ ఓ సలహా ఇచ్చారు. ‘సెమీ ఫైనల్‌లో టాస్ సమస్యే కాదు. భారత బౌలర్లు అదరగొట్టేస్తున్నారు కాబట్టి.. ముందు బౌలింగ్‌ చేస్తారా? లేదా తర్వాత చేస్తారా? అన్నది అనవసరం. ఎప్పుడైనా టాప్‌ 3 పేసర్లు సత్తా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే టాస్‌ గెలిచి తొలుత భారత్ బ్యాటింగ్‌ చేస్తే.. ఓ అడ్వాంటేజ్‌ ఉంది. భారీ స్కోరును న్యూజిలాండ్‌ ముందు ఉంచితే.. మన బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించగలరు. తేమ ప్రభావం కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. కుల్దీప్ యాదవ్‌ వంటి స్పిన్నర్‌ బంతి స్కిడ్‌ కాకుండా బౌలింగ్‌ చేయగలడు. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే 400 పరుగులేమీ చేయనక్కర్లేదు.. 260-270 పరుగులు చేసినా చాలు’ అని సన్నీ తెలిపారు.

Also Read: Virat Kohli: నువ్ మగాడివిరా బుజ్జి.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కే సాధ్యం కాలేదు!

‘సెమీ ఫైనల్‌లో రోహిత్ శర్మ దూకుడైన ఆట తీరును కొనసాగిస్తాడని భావిస్తున్నా. టోర్నీ ఆసాంతం రోహిత్ దూకుడుగా ఆడాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం హిట్‌మ్యాన్ ఆడడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేందుకు ఎటాకింగ్‌ గేమ్ ఆడతాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించేందుకు తొలి పది ఓవర్లలోనే భారీగా పరుగులు చేస్తాడు. రోహిత్ దూకుడుగా ఆడితే.. మిగతా 40 ఓవర్ల ఆటలో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. శుభ్‌మన్ గిల్ రూపంలో రోహిత్ శర్మకు మంచి పార్టనర్‌ దొరికాడు. గిల్ స్ట్రోక్‌ ప్లేతో ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలు బాగా ఆడుతున్నారు. ఇదే ఫామ్ వారు కొనసాగిస్తే విజయం ఖాయం’ అని సునీల్ గవాస్కర్ చెప్పారు.