Sunil Gavaskar Slams Team India Management: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయి. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లేదా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లో ఎవరు తుది జట్టుపై నిర్ణయాలు తీసుకుంటున్నారు? అని అభిమానుల మెదడును తొలిచేస్తోంది. గిల్ ధైర్యంగా తన అభిప్రాయాలను కోచ్ ముందు వెల్లడిస్తున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శార్దూల్ ఠాకూర్‌కు బదులు కుల్దీప్‌ను ఆడించడానికే గిల్ మొగ్గి చూపించాడని, కోచ్ అతడి నిర్ణయాన్ని పట్టించుకోలేదని పరోక్షంగా చెప్పారు.
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘తుది జట్టు విషయంలో కెప్టెన్ కీలక పాత్ర పోషించాలి. కెప్టెన్‌దే జట్టు విషయంలో తుది నిర్ణయం. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ విషయంలో చర్చ జరిగుండొచ్చు. శుభ్‌మాన్ గిల్ బహుశా శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనుకోలేదు. కుల్దీప్‌ను అవకాశం ఇవ్వాలనుకున్నాడు. గిల్ కెప్టెన్ కాబట్టి అతడే తుది నిర్ణయం తీసుకోవాలి. జట్టులో ఎవరు ఉండాలి?, ఉండకూడదు? అనేది కెప్టెన్‌దే నిర్ణయం. ఎందుకంటే ఏం జరిగినా కెప్టెన్‌దే పూర్తి బాధ్యత. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్‌ను మార్చాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరెవరైనా అయినా సరే.. వారి స్వంత ఉనికి, స్టయిల్ ఉంటుంది’ అని తెలిపారు.
Also Read: Team India: అరంగేట్రం కోసం ఏళ్లుగా ఎదురుచూపులు.. అతడి తర్వాత వచ్చిన 16 మంది కెరీర్‌ను ప్రారంభించారు!
‘ఆ కాలంలో కోచ్‌లు లేరు. కేవలం మాజీ ఆటగాళ్లు జట్టుకు మేనేజర్లుగా, అసిస్టెంట్ మేనేజర్లుగా ఉండేవారు. వారి వద్దకు వెళ్లి నేరుగా మాట్లాడొచ్చు. లంచ్, రోజు ముగిసిన తర్వాత సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు పూర్తిగా మారింది. భారత క్రికెట్ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇలా లేదు. బీసీసీఐ నుంచి గౌతమ్ గంభీర్ తనకు కావాల్సినవి అన్ని తీసుకున్నాడు. కేకేఆర్ స్టాఫ్ మొత్తాన్ని టీమిండియాలోకి తెచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించడంలో గౌతీ పాత్ర ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ కంటే తనకే ఎక్కువ పవర్ ఉండాలని గంభీర్ అనుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనకు గౌతీదే మొత్తం క్రెడిట్’ అని సన్నీ చెప్పుకొచ్చారు. తుది జట్టు విషయంలో గంభీర్ కలగజేసుకుంటున్నాడని సన్నీ ఫైర్ అయ్యారు.
