NTV Telugu Site icon

Asia Cup 2023: మార్పులు అవసరం లేదు.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ సెలెక్టర్!

Team India

Team India

Suni Joshi and Gautam Gambhir Debate on India Squad For Asia Cup 2023: ఆసియా కప్‌ 2023 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. తెలుగు ప్లేయర్ తిలక్‌ వర్మకు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. స్టాండ్-బై ఆటగాడిగా సంజు శాంసన్ ఎంపిక కాగా.. యుజ్వేంద్ర చహల్‌, శివమ్‌ దూబెలకు నిరాశే ఎదురైంది.

ఆల్‌రౌండర్ జాబితాలో హార్దిక్‌పాండ్యాకు బ్యాకప్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే శార్దూల్ కంటే ఆల్‌రౌండర్ బ్యాకప్‌గా శివమ్‌ దూబె ఉంటే బాగుండేదని భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ అభిప్రాయపడ్డారు. ‘శివమ్‌ దూబె ఫామ్‌ను చూసి భారత జట్టులోకి ఎంపిక చేస్తే బాగుండు. పాండ్యాకు బ్యాకప్‌ అవసరం. శార్దూల్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. పాండ్యా బ్యాకప్‌గా శివమ్‌ దూబె బాగుంటుందని నా అభిప్రాయం. ఆసియా కప్‌ జట్టులో మరో మణికట్టు స్పిన్నర్‌ ఉండాల్సింది. యుజ్వేంద్ర చహల్ లేదా రవి బిష్ణోయ్‌లలో ఎవరో ఒకరు. ఉపఖండ పిచ్‌లపై మణికట్టు స్పిన్నర్లు చాలా ప్రభావం చూపిస్తారు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగాల్సిన అవసరం లేదు. మరో లెగ్‌ స్పిన్నర్‌కు అవకాశం కల్పిస్తే బాగుండేది. మొహ్మద్ షమీకి విశ్రాంతి ఇస్తే స్పిన్నర్‌ను తీసుకొనే అవకాశం ఉండేది’ అని గౌతీ అన్నారు.

గౌతమ్ గంభీర్ అభిప్రాయాలపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ సునీల్ జోషి స్పందించారు. ‘ఆసియా కప్‌ 2023 కోసం ప్రకటించిన జట్టులో మార్పులు అవసరం లేదని నాకు అనిపిస్తోంది. శివమ్‌ దూబె ప్రదర్శన మనం చూశాం. టీ20ల్లో బాగానే ఆడుతున్నా.. వన్డే ఫార్మాట్‌లో రాణించడం లేదు. బౌలింగ్‌లో కూడా గొప్ప ప్రదర్శన ఏమీ లేదు. ఫీల్డింగ్‌లో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. శార్దూల్ ఠాకూర్‌ ఇటీవల కాలంలో బాగా ఆడుతున్నాడు. గౌతమ్ గంభీర్‌.. మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అని సునీల్ జోషి పేర్కొన్నారు.

Also Read: Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. భారత్ తుది జట్టులో తిలక్‌ వర్మ ఉండాల్సిందే!

భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ.

Show comments