NTV Telugu Site icon

Himachal Pradesh: హిమాచల్‌ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సుఖు ప్రమాణం

Sukhwinder Singh Sukhu,

Sukhwinder Singh Sukhu,

Himachal Pradesh: సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ ప్రతిభా సింగ్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 68 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు ముఖేష్‌ అగ్నిహోత్రి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నాయకత్వం శనివారం రాష్ట్రంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సుఖును తదుపరి సీఎంగా పేర్కొంది.

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సుఖ్వీందర్ సింగ్‌ది మొదట్లో సాధారణ జీవనమే. ఆయన తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు కూడా ఒకప్పుడు పాలు విక్రయించారు. పాలు విక్రయించిన సుఖ్వీందర్‌.. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు.. సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీలో చదువుతూ సామాజిక కార్యకర్తగా ఎదిగారు. 1980ల్లో కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా స్టేట్‌ చీఫ్‌ బాధ్యతలు చేపట్టారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక 2000ల్లో స్టేట్‌ కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడయ్యారు. 2003లో తొలిసారి మొదలు.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. 2019 నుంచి ప్రతిభాసింగ్‌ బాధ్యతలు చేపట్టే వరకు పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 58 ఏళ్ల సుఖుకు రాహుల్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.