Priyanka Gandhi: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణాలను మాఫీ చేయడం, కొత్త పథకం కింద సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స వంటి అనేక చర్యలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఖైరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జలబంధ వద్ద ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. దాదాపు 6,000 ప్రభుత్వ హయ్యర్ సెకండరీ, స్కూళ్లను స్వామి ఆత్మానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఆమె హామీ ఇచ్చారు.
Also Read: Rapper Badshah: బెట్టింగ్ యాప్‌లో ఐపీఎల్ ప్రమోషన్.. పోలీసుల ముందు ప్రత్యక్షమైన రాపర్ బాద్‌షా
“ఛత్తీస్‌గఢ్‌లో తిరిగి ఎన్నికైనట్లయితే, కాంగ్రెస్ మహిళల కోసం గ్యాస్ సిలిండర్‌కు రూ. 500 సబ్సిడీని అందించడానికి మహతారీ న్యాయ్ యోజనను ప్రారంభిస్తుంది” అని ఆమె చెప్పారు. స్వయం సహాయక సంఘాల రుణాలు, సక్షం యోజన కింద మహిళలు పొందే రుణాలు మాఫీ చేయబడతాయని ఆమె తెలిపారు. అలాగే రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఆరోగ్య సహాయ పథకం కింద ఉచితంగా వైద్యం అందజేస్తామని ఆమె వెల్లడించారు. తివారా (ఒక రకమైన కందులు)ను రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ‘మతం పేరుతో మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మీ జీవితాల్లో సమస్యలు తెచ్చే వాళ్లకు ఓటేస్తారా, లేక మీ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే పార్టీకి ఓటేస్తారా’ అని బీజేపీపై నిప్పులు చెరిగారు ప్రియాంక గాంధీ.