NTV Telugu Site icon

Storyboard: టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటవుతాయా..? సీట్ల సర్దుబాటు సంగతేంటి..?

Sb

Sb

Storyboard: ఏపీలో బలంగా పాతుకుపోయున్న వైఎస్ జగన్‌ను ఓడించాలంటే జనసేనతో పాటు బీజేపీ పొత్తు కూడా అవసరమనేది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనగా ఉంది. కానీ పొత్తు కావాలని కానీ.. వద్దని కానీ ఆయన ఎక్కడా బయటపడలేదు. యువగళం ముగింపు సభలో జనసేన అధినేత పవన్ పొత్తుకు బీజేపీ ఆశీర్వాదం కావాలని అడిగినా కూడా.. టీడీపీ మాత్రం స్పందించలేదు. పొత్తుపై గుంభనంగా ఉన్న టీడీపీ.. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ లో తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ఛీప్ జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకు కేటాయించే ఎంపీ, లోక్‌సభ స్థానాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డాతో జరిగే చర్చల్లో అంశాలపై ఈ నెల 9వ తేదీన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం-జనసేన కూటమితో కలవాలంటే.. సీట్ల విషయంలో బీజేపీ కొన్ని షరతులు విధించే అవకాశాలు లేకపోలేదు.

పొత్తులో భాగంగా బీజేపీ 10 ఎమ్మెల్యే స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 4 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెల్చుకుంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు అదనంగా కొన్ని స్థానాలు ఆశిస్తోంది. గతంలో గెలిచిన విశాఖపట్నం, నరసాపురంతో పాటు అరకు, రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాల్ని అడుగుతున్నారనే వాదన వినిపిస్తోంది. హీనపక్షం 10-12 స్థానాలు, 2-3 ఎంపీ స్థానాలకు తగ్గదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు 25 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు తగ్గకుండా కేటాయించాల్సి వస్తుంది. అంటే బీజేపీ-జనసేన రూపంలో 35-37 అసెంబ్లీ, 4-6 ఎంపీ స్థానాలు టీడీపీకి తగ్గిపోతాయి. అంటే టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న దాదాపు 40 మందిపై ప్రభావం పడవచ్చు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో అధికార పార్టీ అన్ని సామాజిక సమీకరణాలతో అభ్యర్ధుల్ని ప్రకటిస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పొడిస్తే సమీకరణాలు దాటుకుని టికెట్ కేటాయించడం కష్టం కానుంది. ఇప్పటికే టీడీపీ – జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. జనసేన తమతోనే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంతకాలం ఎటూ తేల్చకుండా బీజేపీ మౌనం పాటించింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయం కావడంతో..చంద్రబాబును ఢిల్లీ పిలిచారనే చర్చ జరుగుతోంది.

టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఫిబ్రవరి 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2014లో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. దీంతో మరోసారి అదే కాంబినేషన్ అయితే తిరుగుండదనే ఆలోచనతో ఉంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయ సేకరణలో కూడా మెజార్టీ అభిప్రాయాలు పొత్తుకు అనుకూలంగానే వచ్చాయి. పైగా ఏపీలో బీజేపీ పెద్దగా బలపడలేదని హైకమాండ్ లెక్కలేసుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు.. ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి.. ఢిల్లీ వేదికగా మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. ధర్మ పోరాట దీక్షలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని కాదని ఒంటరిగా పోటీ చేసిన టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పట్నుంచీ.. చంద్రబాబు బీజేపీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. అటు జనసేనాని పవన్ కూడా కూటమిలోకి బీజేపీని తీసుకొస్తానని మొదట్నుంచీ నమ్మకంగా చెబుతున్నారు. టీడీపీతో పొత్తు అవసరం గురించి పవన్.. బీజేపీ అగ్రనేతలకు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు పవన్ అనుకున్నది సాధించారనే వాదన కూడా వినిపిస్తోంది.

బీజేపీ సహాయ, సహకారాలు లేకపోతే ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదని టీడీపీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన వాతావరణం నుంచి వెసులుబాటు కోసం కాషాయ పార్టీతో మళ్లీ కలిసి బరిలో దిగేందుకు రెడీ అయిపోయింది టీడీపీ. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అండ లేకుండా ఎన్నికలకు వెళితే ఫలితం ఉండకపోవచ్చని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కు ముందుగా నాలుగు నెలల క్రితం ఒకసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ అవడం, బెయిల్ మీద బయటికి రావడం ఈ క్రమంలో చంద్రబాబు, అమిత్ షాతో పొత్తు విషయం మాట్లాడడం మళ్ళీ కుదరలేదు. చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్ రెండుసార్లు అమిత్ షాతో భేటీ అయ్యారు. తండ్రి అరెస్ట్, ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద వివరించారు. ఆ సమయంలో టిడిపి తో పొత్తు విషయంలో బిజెపి వెనక్కి తగ్గిందని కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావడం.. జైలులో ఉన్నప్పుడే జనసేనతో పొత్తు ప్రకటించడం.. దూకుడుగా ముందుకు వెళుతుండడంతో బిజెపి- టిడిపితో పొత్తుకు ఆసక్తిగా ఉందని చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరేముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. బిజెపితో పొత్తు కుదిరినా.. కీలక స్థానాల విషయంలో మాత్రం పట్టు విడువకూడదని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో టిడిపి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో తర్జనభర్జనలు నడిచాయి. అదే సమయంలో 2014లో బిజెపితో పొత్తు వల్ల జరిగిన నష్టం మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది. టిడిపి తో పొత్తు సందర్భంగా బిజెపి పది అసెంబ్లీ స్థానాలను, ఏడు లోక్సభ స్థానాలను కోరుతోంది. అసెంబ్లీ స్థానాల విషయంలో కాస్త పట్టువిడుపులు ప్రదర్శించిన లోక్ సభ స్థానాల విషయంలో మాత్రం బిజెపి పట్టుపట్టే అవకాశం ఉంది. గతంలో గెలిచిన విశాఖ నార్త్, రాజమండ్రి అర్బన్, తాడేపల్లి గూడెం, కైకలూరు అసెంబ్లీ స్థానాల సహ మరో ఆరు స్థానాలు బీజేపీ కోరుతోంది. బీజేపీ – జనసేన పార్టీల రెండింటికీ కలిపి 30 అసెంబ్లీ, 5 లేదా 6 ఎంపీ స్థానాలిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పొత్తులు అందరికీ ఉపయోగం కలిగేలా ఉండాలని మూడు పార్టీలూ లెక్కలేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనూ వాస్తవ బలాబలాల ఆధారంగా జరగాలని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారు. అంతిమంగా కూటమి మెజార్టీ సీట్లు గెలిచేలా సీట్ల సర్దుబాటు ఉండాలనే సూత్రం తెరపైకి వస్తుందనే వాదన వినిపిస్తోంది. ప్రత్యర్థికి మేలు జరిగేలా సీట్ల సర్దుబాటు చేసుకుంటే. పొత్తు పెట్టుకుని కూడా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 2014 నాటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని.. ఈసారి మరింత జాగ్రత్తగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని మూడు పార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఎవరికి ఏం కావాలి.. ఎవరికి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది.. ఎక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంది.. లాంటి అంశాలన్నీ బేరీజు వేసుకుంటామని మూడు పార్టీలూ చెబుతున్నాయి.