Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board About Womens Reservation Bill Faces Fresh Setback As 131st Amendment Bill Fails In Lok Sabha

Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..

Published Date :April 18, 2026 , 11:54 am
By Sudhakar Ravula
  • తొలిసారి 1996లో లోక్‌సభ సమావేశాల్లో మహిళా బిల్లు..
  • 81వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టిన దేవేగౌడ..
  • బిల్లును వ్యతిరేకించిన ములాయం సింగ్‌, లాలు ప్రసాద్..
  • 1997లో గుజ్రాల్‌ ప్రభుత్వంలోనూ బిల్లు ..
  • మళ్లీ అడ్డుకున్న అధికార కూటమిలోని పార్టీలు ..
  • వాజ్‌పేయీ సారథ్యంలోని మహిళా బిల్లును పెట్టిన ఎన్డీయే..
  • స్వయంగా బిల్లును వ్యతిరేకించిన నితీష్‌కుమార్‌..
  • 1999లో అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణ ..
  • 2003లో మరోమారు బిల్లును తీసుకొచ్చిన వాజ్‌పేయీ ప్రభుత్వం ..
  • 2008లో మన్మోహన్‌ సింగ్‌ సారథ్యంలోని యూపీఏ సర్కార్..
  • మరోసారి అడ్డుపడిన లాలు, ములాయం సింగ్‌ ..
  • ఓబీసీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని పట్టు..
  • నా శవం మీదుగానే ఆమోదం పొందాలంటూ లాలు హెచ్చరిక..
Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్‌ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. దీనిపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. దీంతో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమైన 352 ఓట్లను ఎన్డీఏ సాధించలేకపోయింది. దీంతో మిగతా రెండు బిల్లులు..డీలిమిటేషన్‌ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల బిల్లు-2026లను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు.

దేశంలోని చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న ఉద్దేశంతో…కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉత్తరాది, దక్షిణాది భేదాలు చూపి దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి సభ్యులు వ్యతిరేకించారని ఆరోపించారు. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు విపక్ష కూటమి వ్యతిరేకమని విమర్శించారు. నారీమణులకు మేలు చేసే బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. మహిళా సాధికారత దిశగా చేసే పనులకు ఎందుకు మద్దతివ్వడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలుచేసేలా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు. ఒక ఎంపీ లక్షల మంది ప్రజల సమస్యలను ఎలా వినగలరని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుదలను కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. 1972లో ఇందిరా ప్రభుత్వం లోక్‌సభ సీట్లను 545కు పెంచిందన్నారు అమిత్ షా. డీలిమిటేషన్ తర్వాత 50 శాతం స్థానాలు పెరుగుతాయన్న ఆయన…ఇన్నాళ్లపాటు సీట్ల సంఖ్య పెంచకుండా అడ్డుకున్న ఘనత వారిదేనని విమర్శించారు.

కేవలం అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకే ప్రధాని మోదీ ఈ రాజకీయ వ్యూహాన్ని పన్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ తమకు లాభం చేకూర్చేలా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నాన్ని గెర్రీ మాండరింగ్‌గా రాహుల్ అభివర్ణించారు. 2029 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ఈ కుట్రకు తెర తీసిందని, నియోజకవర్గాల పటాలను మార్చడం ద్వారా ప్రతిపక్షాల బలాన్ని తగ్గించాలని మోదీ చూస్తున్నారని రాహుల్ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లే ఈ పార్లమెంటు సెషన్ అజెండా అయితే, తాము ఏమాత్రం సంకోచించకుండా ఈ క్షణంలోనే ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. 2023లో పార్లమెంటు ఆమోదాన్ని పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలు విషయంలో కేంద్ర సర్కారుకు సహకరించేందుకు తాము రెడీ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ముందు రెండు డిమాండ్లు ఉంచింది. డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్ బిల్లును కలపకూడదని ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌ తర్వాత రాష్ట్రాలకు పెరుగుతాయని చెప్పిన సీట్ల సంఖ్యను బిల్లులో పెట్టాలన్నారు. మహిళా బిల్లును, డీలిమిటేషన్ బిల్లును వేరు చేస్తారా…. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50 శాతం పెంచుతారా ? అని వేణుగోపాల్‌ ప్రశ్నించారు.

ప్రస్తుతం దక్షిణాది 5 రాష్ట్రాల్లో 129 సీట్లు ఉన్నాయన్నారు అమిత్ షా. పెంపుతో అవి 195 అవుతాయని… దక్షిణాదిలో సీట్ల సంఖ్య 23.7 శాతం ఉందన్నారు. గంట సమయం ఇస్తే బిల్లులో సవరణలు చేసుకుని వస్తామని…. అప్పుడు బిల్లుకు మద్దతిస్తారేమో వేణుగోపాల్‌ చెప్పాలన్నారు అమిత్ షా. 50 శాతం పెంచుతూ సవరణ తెచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే బిల్లులో సవరణ చేసి సభ్యులకు కాపీలు ఇస్తామన్నారు అమిత్ షా. కేంద్ర ప్రవేశపెట్టిన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం…మహిళా విరోధులని విమర్శించారు. మూడింట రెండొంతల మెజార్టీ సాధించలేకపోయిన ఎన్డీఏ…బిల్లు వీగిపోయినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో డీలిమిటేషన్‌ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2026 వెనక్కి తీసుకుంటున్నట్లు రిజుజు ప్రకటించారు.

పార్లమెంట్‌లో 2023 సెప్టెంబరు 20న ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. బిల్లును రెండున్నరేళ్ల క్రితమే ఉభయసభలు పాస్ చేశాయి. ఇక్కడి దాకా ఒకే…వాస్తవరూపంలోకి వచ్చేదెప్పుడు అన్న ప్రశ్న అప్పటి నుంచి అలాగే మిగిలి ఉంది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాతనే దీని అమలు జరుగుతుందని బిల్లులో ఉంది. అంటే ఇప్పుడు జనాభా లెక్కలు జరగాలి. వాటి ఆధారంగా నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరించాలి. ఆ తర్వాతే రిజర్వేషన్ల అమలు ప్రారంభమవుతుంది. 128 వ రాజ్యాంగ సవరణ చట్టం-2023 అమలులోకి వచ్చిన తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజక వర్గాలను పునర్విభజించి…15 ఏళ్లపాటు రిజర్వేషన్ అమలు చేస్తామని అప్పట్లో కేంద్రం ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక సెషన్ పెట్టి మరీ బిల్లును పాస్ చేయించారు. కానీ దీని అమలు ఎప్పుడు అన్నదాని మీద క్లారిటీ ఇవ్వలేదు. బిల్లులో పేర్కొన్న రెండు షరతులు ఎప్పుడు నెరవేరతాయో ఖచ్చితమైన కాలపరిమితి లేదు. జనాభా లెక్కల ప్రక్రియ, ఆపై రాజ్యాంగ నిబంధనల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేయాలనే దానిపై నిర్దిష్టమైన తేదీ లేమీ లేవు. మొత్తంగా మూడు దశల్లో అంటే…జనాభా లెక్కలు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్…ఇలా సాగుతుంది.

దేశంలో లోక్‌సభ, శాసనసభల నియోజక వర్గాల పెంపు జనాభా ప్రాతిపదికన కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య కూడా కాలక్రమేణా పెరగాల్సి ఉంది. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత 2001 వరకు లోక్‌సభ నియోజకవర్గాల విస్తరణ నిలిపి వేశారు. మళ్లీ 2001లో రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్‌సభ నియోజక వర్గాల విస్తరణను ఆపేశారు. 2008లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి, దాని ప్రకారం 2009 నుంచి తదుపరి ఎన్నికలు జరిగాయి. కానీ సీట్ల సంఖ్య పెరగలేదు. దీంతో లోక్‌సభ సభ్యుల సంఖ్య 543గానే ఉండిపోయింది. ప్రస్తుతం లోక్‌సభ సీట్లను రాష్ట్రాల వారీగా 50 శాతం పెంచుతూ…లోక్‌సభలో కేంద్రం బిల్లు పెట్టింది. దేశ జనాభా పెరగడంతో… చైనాను ఎప్పుడో అధిగమించింది. పట్టణీకరణ కూడా వేగంగా జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఓటరుకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన ప్రభుత్వం డీలిమిటేషన్ తర్వాత నుంచి అమలు చేస్తామని చెబుతోంది. అంటే సీట్లు పెరిగిన తర్వాత…మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. జనగణన నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రాతిపదికగా అవుతుంది. జనాభా లెక్కలను ప్రతి పదేళ్లకొకసారి నిర్వహించాలి. భారత్‌లో చివరిసారి 2011లో జనాభా లెక్కలు జరిగాయి. మళ్లీ 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. కుల గణన చేయాల్సి వస్తుందన్న భయంతో సర్కార్ చేపట్టడం లేదని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. మొత్తం మీద మళ్లీ జనాభా గణన ఎప్పుడన్నదానిపై స్పష్టత లేదు.

నిజానికి 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను 2026 తర్వాత పెంచుకోవచ్చు. ఈసీ రూల్స్ రూల్స్ ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం అంటే 2031లో జరిగే సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. అప్పటి దాకా 2001 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు కొనసాగుతాయి. డీలిమిటేషన్ అనేది రాష్ట్రాల్లోని శాసన సభల నియోజకవర్గాల సంఖ్యను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే ప్రక్రియ. ఇది మారుతున్న జనాభాకు అనుగుణంగా ఇది నిరంతరంగా జరిగేది. కానీ అన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఓట్లు పెంచుతామని కేంద్రం చెప్పింది. డీలిమిటేషన్ కోసం కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. స్వాతంత్ర్యం వచ్చాక 1952లో తొలిసారి, తర్వాత, 1962, 1972, 2002 సంవత్సరాలలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌కు రాజ్యాంగం ద్వారా అనేక అధికారాలు, స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేరు. ప్రతి రాష్ట్రానికి దాని జనాభా నిష్పత్తి ప్రకారం లోక్‌సభ స్థానాలను నిర్ణయిస్తామని 2023లో చెప్పింది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక లోక్‌సభ నియోజకవర్గంగా మార్చారు. ప్రస్తుత నియోజకవర్గాలను 2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో కమిషన్ ద్వారా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంచుతామని కేంద్రం చెబుతోంది.

2021లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దీన్ని నిర్వహించాలన్న ఆలోచనను ప్రస్తుత ప్రభుత్వం చేయకపోతే తదుపరి జనగణన లెక్కలు 2031లో ఉంటాయి. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన అంటే 2031లోనే. దీని తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం మహిళలకు సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. జనాభా లెక్కలకు ఇప్పటి కిప్పుడు నిర్ణయం తీసుకున్నా తుది నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్‌ కమిషన్‌ పనులు మొదలవుతాయి. ఇదంతా సుదీర్ఘ సమయం పట్టే ప్రక్రియ. కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. 2031లోనే జనాభా గణన జరుగుతుందనుకుంటే, మహిళ రిజర్వేషన్ అమలు 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే సాధ్యమవుతుంది. ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల కంటే ముందు డీలిమిటేషన్‌ కుదరదు. అది 2031 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను ఇవ్వడానికి 3 నుంచి 4 ఏళ్లు పట్టొచ్చు. 2037 లేదా 2039 వరకు పట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. చివరిసారిగా జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియకు 5 సంవత్సరాలు పట్టింది. అయితే 50 శాతం సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయిస్తూ…బిల్లు తీసుకువచ్చింది. అది కాస్త వీగిపోయింది.

దేశంలోని మెజారిటీ పార్టీల మద్దతున్నప్పటికీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ బిల్లు 30 ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన బిల్లును తొలిసారిగా 1996లో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి సారథ్యం వహించిన అప్పటి ప్రధాని దేవెగౌడ…దీనికి సంబంధించి 81వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టినప్పటికీ అది అప్పుడు ఆమోదం పొందలేదు. అధికార సంకీర్ణ కూటమిలో ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌, లాలు ప్రసాద్​లు ఈ బిల్లును వ్యతిరేకించారు. ఫలితంగా దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అధ్యయనం కోసం నివేదించారు. ఇక 1996 డిసెంబరులో కమిటీ తన నివేదికను సమర్పించింది. అంతలోనే లోక్‌సభ రద్దవడం వల్ల ఆ బిల్లు కాస్త ఆమోదం పొందకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత 1997లో గుజ్రాల్‌ ప్రభుత్వంలోనూ బిల్లు పెట్టినప్పటికీ.. మళ్లీ అధికార కూటమిలోని పార్టీలు అడ్డుకున్నాయి. అంతలోనే కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల గుజ్రాల్‌ సర్కార్​ అమాంతంగా కూలడం.. బిల్లు అటకెక్కటం ఇలా అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.

దాదాపు రెండేళ్ల తర్వాత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం మహిళా బిల్లును లోక్‌సభలో పెట్టింది. కానీ ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడ్డ ఈ సర్కారు దాన్ని ఏమీ చేయలేకపోయింది. అప్పటి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న నీతీశ్‌ కుమార్‌ స్వయంగా ఈ బిల్లును వ్యతిరేకించారు. 1999లో అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణతో వాజ్‌పేయీ సర్కారు పడిపోయింది. దీంతో మహిళల బిల్లు కథ కంచికి చేరింది. అయితే మళ్లీ అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయీ.. పట్టువదలని విక్రమార్కుడిలా బిల్లును మరోసారి చట్ట సభల్లో ప్రవేశపెట్టారు. కానీ వివిధ పార్టీల్లోని ఓబీసీ నేతలు దాన్ని ముందుకు సాగనివ్వలేదు. దీంతో 2003లో మరోమారు వాజ్‌పేయీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. కానీ చట్టం కావడానికి అవసరమైన మద్దతును మాత్రం ఆ ప్రభుత్వం సంపాదించలేకపోయింది.

2008లో మన్మోహన్‌ సింగ్‌ సారథ్యంలోని యూపీఏ సర్కార్​.. మహిళా బిల్లును లోక్‌సభలో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బీజేపీ, వామపక్షాలు మద్దతివ్వడం వల్ల పెద్దల సభలో ఈ బిల్లు ఆమోదానికి అవసరమైన బలం సమకూరింది. కానీ.. లాలు, ములాయంలు మరోసారి అడ్డుపడటం ఆరంభించారు. ఓబీసీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని పట్టుబట్టారు. అంటే రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కావాలని వారి ఉద్దేశం. ప్రస్తుత బిల్లు.. నా శవం మీదుగానే ఆమోదం పొందాల్సి ఉంటుందంటూ లాలు హెచ్చరికలు జారీ చేశారు. 2008 మే లో ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపించారు. సోనియా గాంధీ, బృందా కారత్, సుష్మా స్వరాజ్‌.. ఈ ముగ్గురూ కలిసి పార్టీలకు అతీతంగా యాదవ్‌ నేతల ద్వయాన్ని బలంగా అడ్డుకోవడంతో…2010 మార్చి 9న అనూహ్యంగా ఈ బిల్లును రాజ్యసభ 186-1 ఓట్ల తేడాతో ఆమోదించింది. అలా కాంగ్రెస్‌, వాపక్షాలు, బీజేపీ కలిసి నడిచిన అరుదైన సందర్భాన్ని అప్పటి సభ చూసింది. కానీ లోక్‌సభలో బిల్లు చర్చకు మాత్రం రాలేదు. 2014లో సభ గడువు ముగియడంతో అది పనికిరాకుండానే పోయింది.

1987లో రాజీవ్‌ గాంధీ సర్కారు.. దేశంలో మహిళల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అప్పటి కేంద్ర మంత్రి మార్గరెట్‌ అల్వా సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మహిళలకు జాతీయ విధానం అంటూ ఓ నివేదికను సమర్పించింది. అందులో 353 సిఫార్సులు ఉన్నాయి. వాటిలో ఉమ్మడి పౌరస్మృతి అమలుతో పాటు మహిళలకు ఆస్తి హక్కు, చట్టసభల్లో కొన్ని సీట్లు కేటాయించాలని అందులో సూచించారు. పంచాయతీలు, నగర పాలికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లకు ఉద్దేశించి 1989లో రాజ్యాసభ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే లోక్‌సభలో ఆమోదించినప్పటికీ రాజ్యసభలో రాజీవ్‌ సర్కారు విఫలమైంది. కానీ పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆ బిల్లులను 1993లో మళ్లీ ప్రవేశ పెట్టి ఆమోదం పొందారు. అవి చట్టాలుగా మారి ప్రస్తుతం స్థానిక సంస్థల్లో 40 శాతం పైగా మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తోంది. భారత్‌లో స్వాతంత్య్రానికి ముందు నుంచే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండేవి. బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో 1935 చట్టం రాష్ట్రాల చట్ట సభల్లో 41 సీట్లు, సెంట్రల్‌ లెజిస్లేచర్‌లో పరిమిత సీట్లను మతాల వారీగా మహిళలకు కేటాయించింది. అదీ వివాహితలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇది మహిళలపై ప్రేమతో, గౌరవంతో ఇచ్చిందేమీ కాదు. విభజించు పాలించు సూత్రంలో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమం నుంచి మహిళలను దూరం చేసేందుకు ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ. దేశంలోని మహిళలందరికీ ఓటు హక్కు ఇవ్వడానికి కూడా అంగీకరించని ఆంగ్లేయులు చట్ట సభల్లో సీట్లు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం అదే. అందుకే ఆఖరికి మహిళా సంఘాలే ఈ రిజర్వేషన్లు తమకు వద్దని నినదించాయి.

రాజ్యాంగ సభలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నాం కాబట్టి…అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో చట్ట సభల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది. భారత మహిళలకు సమానత్వం కావాలి తప్ప రిజర్వేషన్లు కాదంటూ పూర్ణిమా బెనర్జీ, సరోజిని నాయుడు, రేణుకా రేలు రాజ్యాంగ సభలో వాదించారు. అందుకే 1935 చట్టంలో ఉన్న అనేక అంశాలు స్వాతంత్య్రానంతరం రాజ్యాంగంలో భాగమైనా మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లను తొలగించారు. 2023 సెప్టెంబరులో పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ చరిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడం వల్ల దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్టయింది. అమెరికా, ఇంగ్లాండ్‌, చైనా వంటి దేశాలు ఈ కరోనా సమయంలోనే తమ జనగణనను పూర్తి చేశాయి. 2029లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాకపోతే ఈ బిల్లు అమలు చేయలేమని న్యాయనిపుణులు చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌…వీలయినంత త్వరగా జనగణను పూర్తి చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. జనాభా లెక్కలు తేలితే…పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతుంది. అప్పుడు మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం జనగణనను పూర్తి చేసి…మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ దిశగా కేంద్రంలోని మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 131st Amendment Bill
  • Amit Shah speech Lok Sabha
  • Delimitation Bill 2026
  • Indian politics news
  • Lok Sabha voting news

తాజావార్తలు

  • Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..

  • Iran: గంటలో 7 అబద్ధాలా.? ట్రంప్ వాదనలపై ఇరాన్ ఆగ్రహం..

  • IPL 2026-SRH: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక అప్‌డేట్‌.. సన్‌రైజర్స్‌లోకి ముంబై ఇండియన్స్ పేసర్!

  • Lok sabha: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా

  • Prakash Raj Faces Defamation Suit: ప్రకాష్‌ రాజ్‌కు షాక్.. వంద కోట్ల పరువు నష్టం దావా..!

ట్రెండింగ్‌

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions